
- 20 రోజుల్లో పంపిణీ అయ్యే కోటా 9 రోజుల్లోనే పూర్తి
- ఉమ్మడి జిల్లాలో సన్న బియ్యం తీసుకునేందుకు కార్డుదారుల ఆసక్తి
- ఎమ్మెల్యేలు, కలెక్టర్ల భోజనాలతో పేదిళ్లలో సన్నబియ్యం సంబురాలు
కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ జోరుగా సాగుతోంది. పది రోజులుగా జిల్లాలోని రేషన్ షాపులు కార్డుదారులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇప్పటికే 80 శాతం కార్డులకు సన్న బియ్యం పంపిణీ చేసినట్లు అధికారులు చెప్పారు. చివరి కార్డుదారు వరకు బియ్యం ఇచ్చేందుకు రేషన్ డీలర్లు షాపులు తెరిచే ఉంచుతున్నారు. ప్రభుత్వం రేషన్ కార్డులో పేరున్న ఒక్కో లబ్ధిదారుడికి 6 కేజీల చొప్పున, అంత్యోదయ అన్న యోజన కార్డు ఉన్న కుటుంబానికి 35 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా జగిత్యాల జిల్లాలో 3,07,097 రేషన్ కార్డులకు 5,671 టన్నుల బియ్యం అలాట్ కాగా ఈ నెల 9 వరకు 4,563 టన్నులు(80 శాతం) పంపిణీ చేశారు. కరీంనగర్ జిల్లాలో 2,76,930 కార్డులకు 5,160 టన్నులకుగానూ 4,564 టన్నులు(88 శాతం), పెద్దపల్లి జిల్లాలో 2,19,712 కార్డులకు 4,013 టన్నులకుగానూ 3,137 టన్నులు(78 శాతం), రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1,73,578 కార్డులకు 3,275 టన్నులకుగానూ 2,516 టన్నుల బియ్యం(77 శాతం) పంపిణీ చేశారు. మొత్తంగా 18,069 టన్నులకు గానూ 14,780 టన్నుల సన్నబియ్యం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఒకటి, రెండు రోజుల్లోనే నో స్టాక్బోర్డులు
గతంలో దొడ్డు బియ్యం కావడంతో వాటిని చాలామంది తీసుకునేందుకే ఆసక్తి చూపించేవారు కాదు. తీరిక దొరికినప్పుడు బియ్యం తీసుకెళ్లేవారు. దీంతో నెలలో మొదటి 20 రోజులపాటు పంపిణీ సాగేది. అలాంటిది ఈ ఏప్రిల్ నెలలో మాత్రం ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ స్టార్ట్చేయడంతో తమ కోటా తీసుకునేందుకు కార్డుదారులు ఆసక్తి కనబరిచారు. దీంతో ప్రతి నెలా 20 రోజుల్లో పంపిణీ అయ్యే కోటా 10 రోజుల్లోనే పూర్తి కావడం విశేషం. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రావాల్సిన కొంత స్టాక్ ట్రాన్స్ పోర్టేషన్ సమస్యతో రాకపోవడంతో కొందరు డీలర్లు ఒకటి, రెండు రోజులు నో స్టాక్ బోర్డులు పెట్టాల్సి వచ్చింది. స్టాక్ వచ్చాక మళ్లీ పంపిణీ చేస్తున్నారు.
పేదల ఇళ్లలో ఎమ్మెల్యేలు, కలెక్టర్ల భోజనం
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రేషన్ కార్డుపై సన్న బియ్యం తీసుకున్న పేదల ఇళ్లలో ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఇతర ఆఫీసర్లు భోజనం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన సన్న బియ్యం ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకుంటున్నారు. ఈ నెల 5న గోదావరిఖనిలో గంగిరెద్దుల(మహారాజుల) వారు నివసించే గుడిసెల్లో ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌భోజనం చేశారు. జగిత్యాల రూరల్ మండలం అంతర్గాంలోని కోల సంజీవ్ ఇంట్లో ఎమ్మెల్యే సంజయ్, కలెక్టర్ సత్యప్రసాద్ మంగళవారం లంచ్ చేశారు.
పెద్దపల్లి మండలం పెద్దకల్వల గ్రామంలో చిటవేని రవి ఇంట్లో గురువారం ఎమ్మెల్యే విజయరమణారావు, కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం వంకాయగూడెం గ్రామంలో గురువారం చలిగంటి గణేశ్ ఇంట్లో సన్నబియ్యంతో వండిన అన్నంతో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్‌దేశాయ్, లక్ష్మీ కిరణ్ సహపంక్తి భోజనం చేశారు.
జిల్లా కార్డుల సంఖ్య బియ్యం పంపిణీ(టన్నుల్లో) కోటా(టన్నుల్లో)
జగిత్యాల 3,07,097 5,671 4,563
కరీంనగర్ 2,76,930 5,160 4,564
పెద్దపల్లి 2,19,712 4,013 3,137
రాజన్న సిరిసిల్ల 1,73,578 3,275 2,516