సన్నబియ్యం పంపిణీ పథకం షురూ.. హుజూర్ నగర్లో ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

సన్నబియ్యం పంపిణీ పథకం షురూ.. హుజూర్ నగర్లో ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

హుజూర్ నగర్: దేశంలోనే తొలిసారి రాష్ట్రంలోని రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఉగాది సందర్భంగా ప్రారంభించింది. ఉగాది సందర్భంగా హుజూర్‌‌నగర్‌‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌‌ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పంపిణీ స్కీమ్‌ను ప్రారంభించారు. పది మంది లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సభా వేదికపైన సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ పథకం కింద రేషన్ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం ప్రభుత్వం పంపిణీ చేయనుంది.

వానాకాలంలో కొనుగోలు చేసిన సన్నొడ్లను సీఎంఆర్ కింద మిల్లులకు ఇచ్చిన సర్కార్.. అందులో దాదాపు సగం బియ్యాన్ని ఇప్పటికే జిల్లా స్థాయి గోదాములకు తరలించింది. ఏప్రిల్‌ కోటాకు సంబంధించి ఇప్పటికే ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు, అక్కడి నుంచి రేషన్‌ షాపులకు సన్నబియ్యం సరఫరా మొదలైంది.కాగా, పేదలకు ఉచితంగా సన్నబియ్యం అందించేందుకు కిలోకు రూ.40 వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. ఏప్రిల్​ఒకటో తేదీ నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. దీంతో పేదలు, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు రేషన్​ షాపుల ద్వారా అందించే సన్న బియ్యంతో భోజనం చేయనున్నారు.

ఇన్నేళ్లుగా రేషన్​ బియ్యాన్ని అక్రమంగా వినియోగదారులు, రేషన్​ డీలర్లు బ్లాక్​ మార్కెట్కు తరలించే విధానానికి ఇకపై చెక్​ పడుతుందని అధికారులు భావిస్తున్నారు. దొడ్డు బియ్యం తినేందుకు ఇష్టపడని వారు ఎక్కువ మంది బియ్యాన్ని మధ్యవర్తులకు అమ్మేవారు. వినియోగదారులు తీసుకోకుండా రేషన్​ షాపుల్లో మిగిలిన బియ్యాన్ని కూడా డీలర్లు పక్కదారి పట్టిస్తారనే ఆరోపణలు ఉండేవి. వాటిని ఒక్కచోటకు చేర్చి కోళ్ల దాణాగా ఉపయోగించడంతో పాటు కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు కూడా ఎగుమతి చేసేవారు. బీర్​ఫ్యాక్టరీలకు ముడిసరుకుగా బియ్యాన్ని ఉపయోగించేవారు. ఇప్పుడు సన్న బియ్యం పంపిణీ కావడంతో కార్డుదారులే వాటిని తిసేందుకు ఆసక్తి చూపిస్తారని, దీని వల్ల పేదలకు తినే బియ్యం ఇవ్వాలనే ప్రభుత్వ ఉద్దేశం కూడా నెరవేరుతుందని భావిస్తున్నారు.