
మహబూబ్‌నగర్, వెలుగు: ఉగాది నుంచి రేషన్ కార్డు హోల్డర్లకు సన్న బియ్యం పంపిణీకి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సన్న బియ్యం స్టాక్‌ను అలాట్ చేయాలని సివిల్ సప్లయ్ అధికారులకు ఆదేశాలు జారీ చేయగా.. వారు మూడు రోజుల నుంచి సన్న బియ్యం స్టాక్‌కు అందిస్తున్నారు. ఆదివారం వరకు అన్ని రేషన్ షాపులకు స్టాక్‌ను అలాట్ చేసి.. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి సన్న బియ్యం పంపిణీని ప్రారంభించనున్నారు. దీంతో పేదలు, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు రేషన్ షాపుల ద్వారా అందించే సన్న బియ్యంతో భోజనం చేయనున్నారు..
దిగొస్తున్న సన్న బియ్యం ధరలు..
సన్నాలకు బోనస్ ప్రకటన తరువాత రాష్ట్రంలో పెద్ద మొత్తంలో రైతులు వరి సాగుకు మొగ్గు చూపారు. పెద్ద మొత్తంలో దిగుబడులు వచ్చాయి. డిమాండ్‌కు సరిపడా సన్నాలు అందుబాటులోకి రావడంతో.. మార్కెట్లో సన్న బియ్యం ధరలు దిగి వస్తున్నాయి. 2023 యాసంగిలో కొత్త బియ్యం క్వింటాల్ ధర రూ.3,500 నుంచి రూ.3,800 వరకు ఉండగా.. ఆ ఏడాది సెప్టెంబర్‌లో పాత బియ్యం క్వింటాల్ రూ.4,200 నుంచి రూ.4,500లకు చేరింది. 2024లో వడ్లకు భారీ డిమాండ్ ఏర్పడటంతో వ్యాపారులు ఒక్కసారిగా రేట్లు పెంచారు.
అప్పటి వరకు క్వింటాల్ రైస్‌ను రూ.4,500 లోపు విక్రయించగా.. ఏకంగా రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు పెంచారు. దీంతో క్వింటాల్ సన్న బియ్యం రేట్లు రూ.5,800 నుంచి రూ.6,500కు చేరాయి. ప్రస్తుతం సన్నాల సాగు పెరగడంతో డిమాండ్‌కు తగ్గ వడ్లు అందుబాటులో ఉండడంతో సన్నబియ్యం రేట్లు దిగి వస్తున్నాయి. కొత్త బియ్యం ధరలు రకాన్ని బట్టి రూ.4 వేల నుంచి రూ.5 వేల లోపు దొరుకుతున్నాయి. మరో నెలలో ఈ రేట్లు మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.
అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడేనా?
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొన్నేండ్లుగా రేషన్ బియ్యం దందా జోరుగా సాగుతోంది. కొందరు లబ్ధిదారులు దొడ్డు బియ్యాన్ని తీసుకునే ఇంట్రెస్ట్ లేక.. రేషన్ షాపు యజమానులకే అమ్మేసుకుంటున్నారు. కిలోకు రూ.పది చొప్పున తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ బియ్యాన్ని సేకరించిన కొందరు రేషన్ షాపు నిర్వాహకులు వాటిని కర్నాటక రాష్ట్రానికి లేదంటే మిల్లర్లకు ఇస్తున్నారు. ఇందుకు వారికి కిలోకు రూ.12 చొప్పున చెల్లిస్తున్నట్లు సమాచారం.
మరికొందరు ఆటోల్లో గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ పీడీఎస్ బియ్యాన్ని సేకరించి డంప్ చేసుకుంటున్నారు. సమయం చూసి ఈ బియ్యాన్ని బార్డర్ దాటిస్తున్నారు. ఇటీవల ఉమ్మడి జిల్లాలోని పలు చోట్ల పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను ఆఫీసర్లు పట్టుకొని సీజ్ చేశారు. కానీ, ఈ అక్రమ దందాను ఆఫీసర్లు అరికట్టలేకపోతున్నారు. రేషన్ షాపుల్లో ఇక నుంచి సన్న బియ్యం జరగనుండడంతో లబ్ధిదారులు వాటిని తీసుకొనే అవకాశం ఉండడంతో అక్రమ రవాణా తగ్గుతుందని అంటున్నారు.
జిల్లా రేషన్ కార్డులు బియ్యం కేటాయింపులు రేషన్ షాపులు
(మెట్రిక్ టన్నుల్లో..)
మహబూబ్‌నగర్ 2,44,578 5,229 506
నారాయణపేట 1,52,323 3,397 73
రికార్డు స్థాయిలో సాగు..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సన్నాలకు రూ.500 బోనస్ ప్రకటించింది. గత వానాకాలం సీజన్ నుంచి ఈ స్కీమ్‌ను ప్రారంభించడంతో రాష్ట్ర వ్యాప్తంగా సన్నాల సాగు గణనీయంగా పెరిగింది. మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో వానాకాలంలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 2.20 లక్షలు కాగా.. బోనస్ ప్రకటించడంతో రికార్డు స్థాయిలో 3.55 లక్షల ఎకరాల్లో రైతులు సన్నాలను సాగు చేశారు.
ఈ రెండు జిల్లాల్లో 8 లక్షల మెట్రిక్ టన్నుల సన్నాల దిగుబడి వచ్చింది. యాసంగిలోనూ ఈ రెండు జిల్లాల్లో పెద్ద మొత్తంలో వరి సాగు ప్రారంభమైంది. ఈ సీజన్లో వరి సాధారణ సాగు విస్తీర్ణం రెండు జిల్లాల్లో 1.80 లక్షల ఎకరాలు కాగా.. 2.30 ఎకరాల్లో వరి పంటలు సాగువుతున్నట్లు వ్యవసాయ శాఖ రికార్డులు చెబుతున్నాయి. దీంతో ఈ సీజన్లో కూడా దాదాపు ఆరు లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది.