సన్న బియ్యం పంపిణీకి సర్వం సిద్ధం

 సన్న బియ్యం పంపిణీకి సర్వం సిద్ధం
  • ఏప్రిల్ 1 నుంచి ఇచ్చేందుకు ఏర్పాట్లు 
  • ఉమ్మడి జిల్లాలో 21,83,215 మందికి లబ్ధి 
  • ప్రతి నెలా 12,893 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం 
  • ఇప్పటికే రేషన్ షాపుల్లో బియ్యం నిల్వలు

 కామారెడ్డి, నిజామాబాద్, వెలుగు : ఏప్రిల్ 1 నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీకి ఉమ్మడి జిల్లాయంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఉగాదికి సీఎం రేవంత్​రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. అధికారులు ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్​ షాపులకు బియ్యాన్ని తరలించి రెడీగా ఉంచారు.  ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గోడౌన్లలో సన్న బియ్యాన్ని నిల్వ చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 21,83, 215 మంది లబ్ధిదారులకు సన్న బియ్యం అందనున్నాయి.

ఒక్కో లబ్ధిదారుడికి 6 కిలోల చొప్పున పంపిణీ చేయనున్నారు. కామారెడ్డి జిల్లాలో 2,53,655 కార్డులు ఉండగా, 8,54,529 మంది లబ్ధిదారులు ఉన్నారు.  వీరికి ప్రతి నెలా 5,442  మెట్రిక్​ టన్నుల బియ్యం అవసరం ఉంటుంది.   నిజామాబాద్​ జిల్లాలో 4,03,025 కార్డులు ఉండగా,  12,83,215 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా 7,451 మెట్రిక్​ టన్నుల  బియ్యం అవసరమవుతుంది. 

రెండు జిల్లాలకు కలిపి  ప్రతి నెలా 12,893 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేయాల్సి ఉంటుంది.  ప్రభుత్వం ఇప్పటి వరకు దొడ్డు బియ్యం సరఫరా చేయగా,  అధిక శాతం కార్డుదారులు వండుకోకుండా అమ్ముకోవడంతో సర్కార్​బియ్యం పక్కదారి పట్టిన విషయం తెలిసిందే. ప్రజాభిప్రాయాన్ని గౌరవించిన కాంగ్రెస్​ ప్రభుత్వం  సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది.

  ఇందుకు గాను  సన్నాల సాగును ప్రొత్సహిస్తూ రూ.500 బోనస్ చెల్లిస్తోంది. ఉమ్మడి జిల్లాలో సన్నాల సాగు విస్తీర్ణం గతంలో కంటే పెరిగింది. కామారెడ్డి జిల్లాలో గత వానకాలం సీజన్​లో ప్రభుత్వం లక్ష  మెట్రిక్​ టన్నుల సన్న వడ్లను కొనుగోలు చేసింది.  మిల్లర్లు 60 వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే బియ్యం మర పట్టించి గోడౌన్లలో నిల్వ చేశారు. స్కూల్స్​లో మధ్యాహ్న భోజనం, హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్​లో విద్యార్థుల భోజనం కోసం 550 నుంచి 600 టన్నుల వరకు అవసరమవుతున్నది.  

రేషన్ షాపులకు సన్న బియ్యం​.. 

ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ షాపులకు సన్న బియ్యం సప్లయ్ చేయటం గత 4  రోజులుగా సాగుతోంది. కామారెడ్డి జిల్లాలో 578 రేషన్ షాపులు ఉండగా, ఇప్పటికే సగం షాపులకు సన్న బియ్యం చేరాయి. మిగతా షాపులకు 2 రోజుల్లో పంపనున్నారు. నిజామాబాద్ జిల్లాలో 759 రేషన్​ షాపులకూ సన్న బియ్యాన్ని తరలించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో షాపులకు సన్నబియ్యం  సప్లయ్​ చేసినట్లు  కామారెడ్డి  డీఎం రాజేందర్, డీఎస్​వో మల్లికార్జున్ పేర్కొన్నారు.