- జీఎం ఇంటి ఎదుట మూత్రం పోసిన ఎద్దు
- కేసు పెట్టిన సింగరేణి సిబ్బంది
- ఎద్దు ఓనర్‌ను పీఎస్‌కు పిలిపించిన పోలీసులు
- మధ్యాహ్నం వరకు కూర్చోబెట్టి పనిష్మెంట్
- న్యూసెన్స్ కేసు పెట్టి కోర్టుకు.. 100 ఫైన్వేసిన జడ్జి
- మానవత్వంతో కట్టిన కోర్టు కానిస్టేబుల్
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో ఘటన
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : సింగరేణి జనరల్ మేనేజర్ ఇంటి ముందు నుంచి పోతూ రోడ్డుపై మూత్రం పోయడమే ఆ ఎద్దు చేసిన పాపమైంది. దీంతో సింగరేణి సెక్యూరిటీ గార్డులు ఇల్లెందు పోలీసులకు కంప్లయింట్ఇవ్వడం, వారు సీరియస్‌గా తీసుకుని ఎద్దు ఓనర్‌ను పీఎస్‌కు పిలిపించడం చకచకా జరిగిపోయాయి. అక్కడ మధ్యాహ్నం వరకు కూర్చోబెట్టి నోటీసు ఇచ్చి కోర్టుకు తీసుకువెళ్లారు. జడ్జి రూ.100 జరిమానా విధించగా తన దగ్గర లేవని ఓనర్ చెప్పాడు. దీంతో కోర్టు కానిస్టేబులే మానవత్వంతో ఫైన్ కట్టారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో జరిగింది.
అదెప్పుడు పోస్తదో నాకెట్లా తెలుస్తది!
ఇల్లెందులోని నంబర్2లో బస్తీలో ఉంటున్న సుందర్‌లాల్‌కు ఎద్దుల బండి ఉంది. దీన్ని కిరాయికి నడుపుకుంటూ బతుకుతున్నాడు. గత నెల 29న ఉదయం మండలంలోని 21 ఏరియా నుంచి ఎద్దుల బండిని తోలుకుంటూ వెళ్తున్నాడు. 24 ఏరియాలోని సింగరేణి జీఎం ఇంటి ఎదుట రోడ్డుపై నుంచి వెళ్తుండగా ఎద్దు మూత్రం పోసింది. దీన్ని పెద్ద నేరంగా పరిగణించిన సెక్యూరిటీ సిబ్బంది ఎద్దు యజమాని సుందర్‌పై పోలీసులకు కంప్లయింట్ఇచ్చారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు హడావిడిగా సుందర్‌లాల్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. ‘ఏమనుకుంటున్నావ్. నీ ఎద్దు సాక్షాత్తు జీఎం ఇంటి ముందు రోడ్డుపై మూత్రం పోస్తుందా? ఎంత ధైర్యం. నీ ఎద్దు చేసిన నేరానికి నీపై ఐపీసీ సెక్షన్290 (న్యూసెన్స్) కింద కేసు నమోదు చేస్తున్నాం అని చెప్పారు. ‘సార్ ఎడ్ల బండి తోలుకుని బతికేటోన్ని. అయినా నా ఎద్దు ఎక్కడ మూత్రం పోస్తదో నాకెట్లా తెలుస్తది. ఎక్కడ పోయాల్నో పోయద్దో దానికెట్లా తెలుస్తది. అది పోయి పోయి జీఎం సార్ ఇంటి ముంగట్నే పోయాల్నా..ఏం జేసేది?’ అని తల పట్టుకున్నాడు. దీంతో పోలీసులు అదంతా తమకు తెలియదని చేసిన నేరానికి శిక్ష అనుభవించాల్సిందేనని ఇల్లెందులోని స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టుకు తీసుకువెళ్లారు. కేసు విచారించిన జడ్జి రూ.100 ఫైన్వేశారు. డబ్బులు లేవనడంతో సుందర్ బాధ చూసిన కోర్టు కానిస్టేబులే ఫైన్కట్టి విడిపించాడు.
కావాలనే చేస్తున్నడు
సుందర్ కావాలనే జీఎం ఇంటి ఎదుట ఎద్దులతో మూత్రం పోయిస్తున్నాడని సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది ఆరోపించారు. ఇల్లెందు ఏరియాలో జేకే 5 ఓపెన్ కాస్ట్ ఏర్పాటులో భాగంగా చాలామంది భూములు ఇండ్లు పోయాయని, అందులో సుందర్భూమి కూడా ఉందన్నారు. దానికి పరిహారం రాలేదని రెండేండ్లుగా సింగరేణి యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్నాడని చెప్పారు. అందుకే ఎద్దులతో జీఎం ఇంటి ఎదురుగా ఉన్న రోడ్డుపై మూత్రం పోయించాడన్నారు.