లీడర్లకు సదువెందుకు?
ఓ లీడర్‌ను సదువు సప్టికెట్ సూపియ్యమంటే ఫైన్లు. ఓ లీడర్ ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ సదివిండు. ఉంకో లీడర్ బీకామ్ల ఫిజిక్స్. పలాన లీడర్ ఇంటర్ల బీఎస్సీ సదివిండు. ఓ నాయకుడు నెల్రోజుల బీఏ పాసైండు. గా లీడరొళ్ల డాడీ ఇరిగేషన్ శాఖల టీచర్. ఇంకో సారు 80 వెయ్యిల వొయ్యిలు మర్రేశిండు. గిట్లుంది మనోళ్ల సదువుల కథ. ఆళ్లు మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాల గిర్కలు కొట్టిచ్చుకుంట పడనోళ్లు మస్తు మురుస్తాండ్రు. సూశినోళ్లు ఇంకో నలుగురికి పంపుతాండ్రు. ఒరక్కో.. ఇంతగొడ్తే గా లీడర్లు సదివింది గింతేనా? ఆళ్ల కంటే మా పోరడే జెరంత నయం అన్కోవట్టిరి ఏ సదువులేకున్న ఇస్మార్టు ఫోన్‌ను ఆర్పార్ ఆడేటోళ్లు. గా సదువుల సంగతి చెప్తుంటే మనకు గమ్మతి అన్పిస్తది. కని రాజకీయంకు రావాలంటే సదువు కావాల్నా? దానికి ఎంత సదువాలే? ఏం సదువాలే? ఏ కోర్సు సదివితే దబ్బున టికెటొస్తది? జెల్దిన ఎమ్మెల్యే ఐతరు? రప్పున మంత్రి కావాలంటే ఏ కాలేజీల సదువాలె? సీదా సీఎం సీట్ల కూకుంటానికి ఏమన్న కోర్సులున్నయా? పరీక్షలు ఎవలు వెడ్తరు? పేపర్లు ఎవలు దిద్దుతరు? ఎన్ని మార్కులొస్తే పాస్.. ఫేలైతే ఎట్లా? ఆ సప్టికేట్ సూపిస్తే ఎలక్షన్ల నిలవడకున్న లీడరైనట్టేనా? పార్టీలే ఉర్కొచ్చి టికెట్లిస్తయా? ఏకాన ఖర్సువెట్టాల్సిన పనుండదా.? మందు తాపకున్నా...పైసలు పంచుకున్నా ఓటరు దేవుళ్లు గెలిపిస్తరా? ఎందుకంటే ఆ లీడరేం సదువలే.. గీ లీడర్‌కు సదువే రాదు.. పలాన లీడర్ దొంగ సప్టికెట్లు పెట్టిండు.. గాయినె పది పాసే కాలేదట.. గీ మేడానికి ఏ సదువు లేదట.. అనే చర్చ జోరుగ సాగుతున్నది.
‘ఐదేళ్లకోపారి అసెంబ్లీలో మొసళ్లూ
పార్లమెంట్ లోకి తిమింగళలాలూ
ప్రవేశించడం పెద్ద విశేషం కాదు
జనమే ఓట్ల జలాశయాలై
వాటిని బతికించడం విషాదం’... అలిశెట్టి
నన్నడిగితే లీడర్ల కొడుకులు బయిటి దేశాల్ల సదువుడెందుకు? అమ్రికాల సదివినా.. ఆస్ట్రేలియాల సదివినా.. ఆడ మంచి మంచి కొలువులు జేశినా.. సూటు బూటేస్కోని తిరిగినా ఆఖర్కి రావాల్సింది ఈడికే. గదే రాజకీయ బొందల బొర్లడాలె.. తెల్ల బట్టలు తొడిగి ముర్కి అంటిచ్చుకోవాలె. ఇంట్ల ఇంగ్లీస్ నర్కినా.. బైటికొస్తే బజారు భాషే దంచాలె. వెయ్యిల వొయ్యిలు మర్రేశినోళ్లు నోరు తెరిస్తే పలుకు పలుకు ముత్యమే. అగో నీకే వొస్తయా నాకు రావాని అటుకెల్లి ఉంకో మోతెవరి. ఎంత ముర్కి కూతులు కూస్తే అంత తోపు లీడర్. ఎన్ని గలీజ్ మాటలు మాట్లాడితే అంత గిరేట్. టీవీల మన లీడర్ల సుభాషితాలొస్తుంటే మమ్మీలు బుగులువడి పోరలను ఉంకో అర్రలకు తోల్కవొయ్యే లెవ్వల్ల దంచుతుండ్రు స్పీచులు. రాజకీయంల రాణించాలంటే కావాల్సింది సదువు, సప్టికేట్ గాదు. టక్కు టమార విద్దెలు.. బోకరి మాటలు.. మోసపు శాతలు.. ఎచ్చిడి ఏశాలు.. పదవులు కొనే పైసలు. కమ్మగ తియ్యగ మాట్లాడి ఉబ్బియ్యాలె. ఉద్దెర హామీలతోటి ఊరియ్యాలె. నేను తప్ప మీకు దిక్కులేరని నమ్మియ్యాలె. ఎన్ని అవద్ధాలు చెప్తే అంత పెద్ద లీడరైతరు. దందాలు, ధమ్కీలు, రుబాబు సూపిస్తే తోపు లీడర్ కింద లెక్క. అస్రమైతే మీటింగ్ కాడికి ముందే మనోళ్లను తోలి జిందాబాద్ కొట్టిచ్చుకోవాలే.. సీఎం సీఎం అని ఒర్రిచ్చుకోవాలె. పబ్లిక్ను దగ్గెర్కి రానియ్యకుంటేమాయేగని ఎన్కాల ఎప్పుడో పది మందిని ఏస్కోని తిరిగితే పతార ఉన్నట్టు. చౌరస్తాల మీద కటౌట్లు.. బంగ్లాల మీద బ్యానర్లు.. రోడ్ల మీద ఫ్లెక్సీలు పెట్టిచ్చుకుంటే ఫేమస్ లీడరైనట్టే.
చాయమ్మిన.. పాలమ్మిన
మన దేశం శాన గొప్పది. చిన్నప్పుడు రైలు టేషన్ల చాయ్ అమ్మిన లీడర్ దేశాన్ని ఏలే లెవల్కు తీస్కొస్తది. సైకిల్ మీద పాలు కొట్టిన సారును పార్లమెంట్కు పట్కవోతది. మార్కెట్ల అలుగడ్డలు అమ్మినాయన పెద్ద లీడరైతడు. గోడలకు సున్నాలేశేటాయినె పార్టీకి పెబ్బైతడు. రియల్ ఎస్టేట్ బ్యారగాళ్లు బడా నాయకులైతరు. పాస్ పోర్టు దందాలు జేశినోళ్లకు రాజకీయ పయిల్వాన్లయితరు. కాంట్రాక్టర్లు ఖతర్నాక్ లీడర్లయితరు. గరీబుల బతుకులు ఉద్దరిస్తానికి, ప్యాదల జీవితాలు ఎల్గవెడ్తానికి పెద్దపెద్ద పదవుల్ల ఉంటరు. ఐనా సదువుకు రాజకీయాలకు, సదువుకు పదవులకు లింకేంది అసలు? ఎమ్మెల్యేగా నిలవడాలంటే గింత సదువాలనేమన్న రూలుందా? ఏలిముద్ర ఏశేటోళ్లు సుత బాజాప్త పోటీ జెయ్యొచ్చు. దిమాఖంత కరాబ్ కాంగ పీజీలు, పీహెచ్డీలు సదివినోళ్లు పద్ధతిగా లైన్ల నిలవడి.. ఏం సదువనోళ్లకు ఓటెయ్యాలె. పోని ఓటేస్తప్పుడు పలాన లీడరేం సదివిండు, ఏడ సదవిండని సూత్తమా? గవ్వన్ని మనకెందుకు. నా ఓటును ఎంతకు కొంటడు.. ఎంతకు బ్యారం బెట్టాలె అన్నదే మన లెక్క. లేదంటే నచ్చిన పార్టనో, మెచ్చిన లీడరనో ఉర్కుడేనాయే.. ఏలుకు ఇంక్ అంటిచ్చుకునుడేనాయే.. మిషిన్ మీద కట్కొత్తుడేనాయే. బీఏ సదివిన లీడర్ మెడికల్ కాలేజీ ఎట్ల పెట్టే? ఇంజనీరింగ్ కాలేజీ ఎట్ల తెర్శే? యూనివర్సిటీ పెట్టే లెవల్కు ఎట్ల ఎదిగే? అదే బీఏ సదివినోళ్లు బికారిగాళ్లై రోడ్ల మీదెందుకు తిరుగుతున్నట్టు. అచ్చరం ముక్కరాని అంగూటి లీడర్లు సుత సదువుల మంత్రయ్యే గొప్ప సాన్సు ఉంటది దేశంల. అంతేందుకు దేశంల పెద్ద కొలువు అంటేనే ఐఏఎస్, ఐపీఎస్. ఆళ్లు కలెక్టర్లు, ఎస్పీలైతరు. కని ఆ కలెక్టర్లే లీడర్ల కాళ్లు మొక్కవట్టిరి.. మోకాళ్ల మీద కూకోని ముచ్చట వెట్టవట్టిరి. ఎన్నో నేరాలు, ఘోరాలు జేశి, జేల్ల బగార బువ్వ తినొచ్చినంక పదవి పట్టేస్తే సాలు..అరెస్ట్ జేశిన ఆఫీసరే ఉర్కొచ్చి సెల్యూట్ కొడ్తడు. ఏ సదువు సదువనోళ్లు ఎలక్షన్ల నన్ను గెలిపిస్తే మీకు సర్కార్ నౌకరి ఇప్పిస్తానని గప్పాలు కొడితే అది మనం నమ్ముడు.
భజన చేయాలె
పడని పార్టీ లీడర్‌ను పొట్టుపొట్టు తిట్టాలె. రా సూస్కుందామని తొడలు గొట్టాలె. టికెటిచ్చే అధ్యక్షులవారిని దేవుడు, మా దైవం, మా ఇంటి దీపం అని భజన జెయ్యాలె. ఈడికి సాలకుంటే కొడుకు, మన్మడు, సుట్టాలను సుత సూరెక్కిస్తుండాలె. పాపం ఆయ్న కాడ పైసల్లేవుగని బగ్గ సదువుకుండని ఏ పార్టన్న టికెటిస్తదా? చిన్న కులపోడైన పెద్ద సదువు సదివిండని పదవిల కూకుండవెడ్తరా? రాజకీయం గిట్ల నడుస్తుంటే నడ్మిట్ల లీడర్లకు సదువెందుకు? సదువు సప్టికెటెందుకు? మనం ఆలోశన జెయ్యాల్సింది లీడర్ల సదువులు, సప్టికెట్ల గురించి గాదు. అయ్యవ్వలు ఉప్పుడు ఉపాసముండి మనల్ని కష్టవడి సదివిస్తే పీజీలు, పీహెచ్డీల సఫ్టికెట్లు సంపాయించి.. ఏజ్ బారైతున్నా మనకెందుకు కొలువు రాకపాయే అని. ఎయ్యకెయ్యక కొలువులెస్తే కొచ్చెన్ పేపర్ లీకెట్లాయే.. మన కొలువెటువాయే అని.
- రఘు భువనగిరి