న్యూఢిల్లీ / పెర్త్: ప్రతిష్టాత్మక బోర్డర్–గావస్కర్ ట్రోఫీకి ముందు ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతేడాది ఇదే సిరీస్‌లో అద్భుతంగా ఆడిన యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడ్డాడు. శనివారం జరిగిన ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ సిములేషన్‌లో భాగంగా ఫీల్డింగ్ చేసే క్రమంలో గిల్ ఎడమ బొటన వేలు ఫ్రాక్చర్ అయ్యింది. నొప్పితో విలవిలలాడిన అతను గ్రౌండ్‌ను వీడి స్కానింగ్ కోసం ఆసుపత్రికి వెళ్లాడు. దీంతో పెర్త్‌లో 22 నుంచి జరిగే తొలి టెస్ట్‌లో గిల్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. ఒకవేళ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకపోతే ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ మరింత బలహీనంగా మారుతుంది.
‘గిల్ ఎడమ బొటన వేలికి గాయమైంది. గాయం తీవ్రతను అంచనా వేస్తున్నాం. తొలి టెస్ట్‌కు వారం రోజులే టైమ్ ఉంది. కాబట్టి ఆలోగా అతను కోలుకోవడం కష్టమే’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. సాధారణంగా బొటన వేలి గాయం తగ్గడానికి14 రోజుల టైమ్ పడుతుంది. ఆ తర్వాత రెగ్యులర్ నెట్ సెషన్స్‌లో పాల్గొని ఫుల్ ఫిట్‌నెస్ సాధిస్తే డిసెంబర్ 6 నుంచి అడిలైడ్‌లో జరిగే రెండో టెస్ట్‌కు అతను అందుబాటులో ఉండొచ్చు. ఓవరాల్‌గా గిల్ లేకపోతో ఇండియా లైనప్‌కు ఇబ్బందులు తప్పకపోవచ్చు. మూడో నంబర్‌తో పాటు గిల్‌కు ఓపెనింగ్ చేసే సత్తా కూడా ఉంది. రోహిత్ లేని పక్షంలో యశస్వి జైస్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడని అందరూ భావించారు. కానీ గాయంతో అతను ఆడటమే అనుమానంగా మారింది. ఒకవేళ గిల్, రోహిత్ ఇద్దరూ లేకపోతే అభిమన్యు ఈశ్వరన్‌కు అరంగేట్రం చాన్స్ దక్కొచ్చు. ఎందుకంటే ఇంతకు మించిన మరో ప్రత్యామ్నాయం జట్టులో కనిపించడం లేదు.
రాహుల్ కూడా డౌటే...
మోచేతి గాయంతో ఇబ్బందిపడుతున్న కేఎల్ రాహుల్ ప్రాక్టీస్‌కు రాలేదు. గాయానికి ఐస్ ప్యాక్‌ను కట్టుకుని కనిపించాడు. గ్రౌండ్‌లో అటుఇటు తిరిగినా ఒక్క బాల్‌ను కూడా టచ్ చేయలేదు. ప్రాక్టీస్‌కు చాలా దూరంగా ఉన్నాడు. దీంతో తొలి టెస్ట్‌లో కేఎల్ ఆడటం కూడా డౌట్‌గా మారింది. ఇక రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసి ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన పేసర్ మహ్మద్ షమీ.. ఆసీస్ టూర్‌కు లైన్ క్లియర్ అయినట్లుగానే కనిపిస్తున్నది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే అతను మరో రెండు రోజుల్లో ఫ్లైట్ ఎక్కే చాన్స్ ఉంది. రెండో టెస్ట్‌లో అతను బరిలోకి దిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సోమవారం టీమిండియా పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియం చేరుకుంటుంది. మంగళవారం నుంచి గురువారం వరకు మూడు నెట్ సెషన్స్‌లో పాల్గొంటుంది.