
- 118వ ప్లేస్‌కు చేరిన ఇండియా.. గతేడాది ర్యాంకు124
- ఆక్స్ఫర్డ్ వర్సిటీ వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్ నివేదిక
లండన్: ఫిన్లాండ్ వరుసగా ఎనిమిదోసారి ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా నిలిచింది. ఇండియా ఈ సారి తన స్థానాన్ని కొంత మెరుగుపరుచుకొని 118వ ప్లేస్‌కు చేరుకుంది. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఆనంద దినోత్సవం సందర్భంగా ఆక్స్‌ఫర్డ్‌యూనివర్సిటీ వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్‘‘వరల్డ్ హ్యాపీయెస్ట్ రిపోర్ట్ 2025”ను గురువారం విడుదల చేసింది. ఆయా దేశాల్లోని ప్రజలు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో పాటు సోషల్సపోర్ట్, ఆరోగ్యం, స్వేచ్ఛ, ఔదార్యం, అవినీతి, స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వంటి అంశాలను అంచనా వేసి 0 నుంచి 10 పాయింట్లు కేటాయిస్తూ మొత్తం 140 దేశాలకు ర్యాంకులు కేటాయించారు.
ఫిన్లాండ్ దేశంలో 7.74 సగటుతో ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా నిలిచింది. ఈ సారి అమెరికా 24వ స్థానానికి పడిపోగా.. బ్రిటన్ 23వ స్థానంలో ఉంది. కోస్టా రికా, మెక్సికో మొదటి 10 స్థానాల్లో ఉండడం గమనార్హం. ఈ జాబితాలో అఫ్గానిస్తాన్ చిట్టచివరన ఉంది. సియెర్రా లియోన్, లెబనాన్ చివరి నుంచి రెండో, మూడో స్థానంలో నిలిచాయి. ‘‘ఫిన్లాండ్ వాళ్లు సంపన్నులు, ఆరోగ్యంగా ఉన్నారు. సామాజిక సంబంధాలు, సామాజిక మద్దతు, ప్రకృతితో మంచి రిలేషన్కలిగి ఉన్నారు.
వారు చాలా సంతోషంగా, జయ్ ఫుల్‌గా లేరు. కానీ వారు తమ జీవితంలో చాలా సంతృప్తిగా ఉన్నారు” అని ఆక్స్ఫర్డ్ వర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్, వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ చీఫ్, ది వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ఎడిటర్ జాన్ -ఇమ్మాన్యుయేల్ డి నెవ్ రిపోర్టు విడుదల సందర్భంగా మీడియాతో పేర్కొన్నారు.
కాస్త మెరుగైన భారత్ స్థానం
ఇండియా హ్యాపియెస్ట్ దేశాల లిస్టులో తన ర్యాంకును స్వల్పంగా మెరుగుపరుచుకుంది. 2024లో 126వ స్థానంలో ఉండగా ఈ ఏడాది 118కి ఎగబాకింది. అయితే ఈ ర్యాంకింగ్ లో తీవ్ర అనిశ్చితి, సంఘర్షణలో ఉన్న ఉక్రెయిన్, మొజాంబిక్, ఇరాక్తదితర దేశాలు ఇండియా కంటే మెరుగైన ర్యాంకుల్లో ఉండడం గమనార్హం. అలాగే నేపాల్ 92వ స్థానంలో, పాకిస్తాన్ 109వ స్థానంలో, చైనా 68వ స్థానంలో, శ్రీలంక 133వ స్థానంలో, బంగ్లాదేశ్ 134వ స్థానంలో ఉన్నాయి.
టాప్ 10 హ్యాపీయెస్ట్ దేశాలు ఇవే..
1. ఫిన్లాండ్
2. డెన్మార్క్
3. ఐస్లాండ్
4. స్వీడన్
5. నెదర్లాండ్స్
6. కోస్టారికా
7. నార్వే
8. ఇజ్రాయెల్
9. లక్సెంబర్గ్
10. మెక్సికో