కవర్ స్టోరీ : ఫిన్​లాండ్​లో ఉన్నదేంటి?..మన దేశం కూడా టాప్​ ప్లేస్​కి చేరాలంటే..ఏం చేయాలి?

కవర్ స్టోరీ :  ఫిన్​లాండ్​లో ఉన్నదేంటి?..మన దేశం కూడా టాప్​ ప్లేస్​కి చేరాలంటే..ఏం చేయాలి?

సంతోషం సగం బలం... హాయిగ నవ్వమ్మా...’’ అనే సినిమా పాట గుర్తుందా? అఫ్​కోర్స్​ సంతోషం వల్ల మానసికంగా వచ్చే బలం శారీరకంగా ఆరోగ్యాన్ని ఇస్తుంది. అంటే సంతోషంగా ఉంటే ఫుల్​ హెల్దీగా ఉన్నట్టే. మరయితే ఎంత సంతోషంగా ఉన్నారని కొలిచేదెలా? నిజంగా ఒక మనిషి సంతోషాన్ని కొలవచ్చా? అసలు సంతోషానికి కొలమానం ఉంటుందా? ఎన్ని ప్రశ్నలో ...!  

సంతోషాన్ని స్కేల్​ పెట్టి ‘సరిగ్గా ఇంత’ అని కొలవడం కష్టమే. కానీ, యావరేజ్​గా అంచనా వేయొచ్చు’’ అంటున్నాయి కొన్ని సంస్థలు. అలా సంతోషాన్ని కొలిస్తే... ప్రపంచంలోనే అత్యంత ఆనందమైన దేశంగా ఫిన్​లాండ్​ వరసగా ఐదు సార్లు మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచంలో ఏ దేశం సంతోషంగా ఉందని చేసిన ఈ సర్వేలో మన దేశం వంద స్థానాల్లోపు ఇప్పటివరకైతే రాలేదు.  మరి ఐదు సార్లు సంతోషకరమైన దేశం అనిపించుకున్న ఫిన్​లాండ్​లో ఉన్నదేంటి? మన దేశం కూడా సంతోషం జాబితాలో టాప్​ ప్లేస్​కి చేరాలంటే... ఏం చేయాలి? అది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ఆలోచనలో మునిగిపోయి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. సడెన్​గా తెలిసిన ముఖం కళ్ల ముందు ప్రత్యక్షమై పలకరిస్తే.. తెలియకుండానే ముఖంలో చిరునవ్వు అలుముకుంటుంది​. అలాగే నలుగురిలో ఉన్నప్పుడు పక్కవాళ్లు​ జోక్​ వేస్తే పెద్దగా నవ్వుతారు. కానీ ఎప్పుడూ అలా ఆనందంగా ఉండడం కుదరని విషయం. అందుకే మనసు బాగోలేనప్పుడు ఆ బాధను ఎవరైనా పంచుకుంటే బాగుండు అనిపిస్తుంది. అంతదాకా ఎందుకు కామెడీ సినిమాలు చూసి నవ్వుకోక చాలా రోజులు అయిందని వాటిని వెతికి మరీ చూసేవాళ్లు ఉంటారు.

ఎప్పుడో ఒకప్పుడు లేదా కొన్నిసార్లు మాత్రమే ఉండే ఆనందం ఒక మనిషి లైఫ్​లో కంటిన్యూగా ఉందంటే నమ్మడం కొంచెం కష్టమే. కొందరైతే ‘ఆ ఛాన్సే లేదు’ అంటారు కూడా. కానీ ఫిన్​లాండ్​​ దేశం మొత్తం హ్యాపీగా ఉందని చెప్తోంది హ్యాపీనెస్​ ఇండెక్స్. ఒక దేశం ఒక ఏడాదిలో ఎంత ఆనందంగా ఉందనే దానిపై సర్వే చేసి ఆయా దేశాలకు ర్యాంకింగ్​లు కూడా ఇస్తుంటుంది ‘‘యుఎన్​ సస్టెయినబుల్ డెవలప్​మెంట్​ సొల్యూషన్స్​ నెట్​వర్క్​’’. ఈ నెట్​వర్క్​ ప్రతి ఏటా హ్యాపీనెస్ రిపోర్ట్​ ప్రకటిస్తుంది. ఇలా సర్వే చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి గతేడాది వరకు వచ్చిన రిపోర్ట్​ చూస్తే.. వరుసగా ఐదేండ్లు సంతోషంగా ఉన్న దేశం ఫిన్​లాండ్​. ఐదుసార్లు మొదటి స్థానంలో నిలిచి ప్రపం చాన్ని ఆశ్చర్యపరుస్తోంది. మరి ఫిన్​లాండ్​ ప్రజల హ్యాపీనెస్​ వెనకున్న సీక్రెట్ తెలుసుకోకపోతే ఎలా? 

ఆ ఆరు ఉంటేనే... నెంబర్​ వన్

ఫిన్​లాండ్​లో ప్రజలకు ఇతరుల పట్ల అసూయ ఉండదు. అవతలి వాళ్ల వ్యక్తిగత, సంపాదన వంటి విషయాల్లో తలదూర్చరు. దేశంలో అందరూ కష్టపడి సంపాదిస్తారు. అలానే ఎంజాయ్​ కూడా చేస్తారు. ఎంత చిన్న విషయం గురించి అయినా సరే ప్రజలంతా ఒక్క తాటి పైకి వస్తారు. ఓహో! అయితే వాళ్లు అలా ఉండడం వల్ల ప్రపంచంలోనే సంతోషకరమైన దేశం అయిందన్నమాట అని అప్పుడే ఒక కన్​క్లూజన్​కి రావద్దు. నిజానికి పైన చెప్పుకున్నవే కారణాలు కూడా కాదు. రిపోర్ట్​ ఇచ్చేందుకు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది హ్యాపీనెస్​ను స్కేల్​ చేసే ఆ సంస్థ. వాటిని బట్టి అంచనా వేస్తుందన్నమాట.

ఇంటర్నేషనల్ డే ఆఫ్​ హ్యాపీనెస్’’ సెలబ్రేషన్​లో భాగంగా 2012లో మార్చి 20 తేదీన మొదటిసారి హ్యాపీనెస్ రిపోర్ట్ రిలీజ్ చేశారు. గ్లోబల్ హ్యాపీనెస్ సర్వే... అంటే దాదాపు150 దేశాల ప్రజల దగ్గరి నుంచి డేటా సేకరించి మరీ రిపోర్ట్​ తయారుచేస్తారు. ఆ తరువాత వాటిలో ఒక్కో దేశానికి ఒక్కో ర్యాంక్​ ఇస్తుంటారు. ఫలానా దేశం ‘హ్యాపీయెస్ట్ కంట్రీ’ అని చెప్పడానికి మరీ ముఖ్యంగా ఆరు అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు. అవి.. సోషల్ సపోర్ట్​, ఆదాయం, ఆరోగ్యం, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి రహితంగా ఉండడం. ఫిన్​లాండ్​ ఆరేండ్లుగా ఈ ఆరు అంశాల్లో మొదటి స్థానంలో ఉంటూ వచ్చింది.

ప్రజల సంక్షేమంలో ముందు

అన్ని దేశాలకంటే భిన్నం ఫిన్లాండ్. ఆ దేశంలో ప్రజల గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాయి ప్రభుత్వాలు. విద్య, వైద్యం, సంక్షేమం, నిరుద్యోగులకు బెనిఫిట్స్ కల్పించే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇలాంటి పరిస్థితులు ఉండడం వల్ల అక్కడి ప్రజల్లో ఎకనమిక్​ ఇన్​సెక్యూరిటీ... అంటే ఆర్థికపరంగా ఎటువంటి భయం ఉండదు. హ్యాపీనెస్​లోనే కాదు ప్రపంచంలో అత్యంత అభివృద్ధి పొందిన దేశాల్లో ఫిన్లాండ్ ఒకటి.

ఆ దేశంలో ప్రతి పౌరుడికి​ ఆర్థిక భద్రతతోపాటు అనేక హక్కులు, సౌకర్యాలు ఉంటాయి. సడెన్​గా ఉద్యోగం పోతే ఏమవుతుందో? వృద్ధాప్యంలో డబ్బు లేకపోతే ఎలా? అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ విషయాల్లో బాధ్యత ప్రభుత్వానిదే. ఇవేకాకుండా.. పోలీస్, ఇంటర్నెట్ సేఫ్టీ వంటి విషయాల్లో ప్రపంచ దేశాల్లో ఫిన్​లాండ్​ది రెండో స్థానం. ఇక్కడ ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరుగుతాయి. వ్యక్తిగత, భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంటుంది. అక్కడ న్యూస్​ పేపర్స్​కి కూడా పూర్తి స్వేచ్ఛ ఉంది. రాజకీయం, చట్టం, పోలీస్​ వ్యవస్థపై అక్కడి ప్రజలకు నమ్మకం ఎక్కువ.

నిరాశ్రయులు లేని దేశం

క్లీన్ టెక్నాలజీని ఉపయోగించడంలో వరల్డ్​లోనే రెండో అత్యుత్తమ దేశంగా ‘‘గ్లోబల్ క్లీన్​ టెక్ ఇన్నొవేషన్ ఇండెక్స్’’ పేర్కొంది. టాప్10 లిస్ట్​లో ఉత్తర యూరప్​ దేశాలే ఎక్కువ. అవి ప్రపంచ యుద్ధాల టైంలో నేరు​గా పాల్గొనక పోవడం వల్లే వేగంగా డెవలప్ అయ్యాయి. పైగా ఆయా దేశాల జనాభా తక్కువ. టూరిజం బాగా డెవలప్ అయింది. నాలుగు శాతం జీడీపీ కంట్రిబ్యూట్​ చేస్తుంది. జీడీపీ తక్కువగా ఉన్నప్పటికీ ప్రపంచంలో నిరాశ్రయులు లేని దేశం ఇది. అంతేనా.. అక్కడ ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది. ఫిన్​లాండ్​ బ్యాంక్​లు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనవి. 

ఆడవాళ్లను సమానంగా...

ఫిన్లాండ్ ప్రజలు అత్యంత స్వేచ్ఛాయుత వాతావరణంలో నివసిస్తున్నారు. ఈ దేశ ప్రజలు తమ జీవితం పట్ల సంతృప్తిగా ఉన్నారు. ఇండ్ల గురించి ఎలాంటి కంప్లయింట్స్ ఉండవు. ఉండడానికి స్థలాలు చాలా విశాలంగా, సౌకర్యవంతంగా ఉంటాయి. సమానత్వం విషయంలో ఈ దేశం ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. యూరప్​ ఖండంలో మహిళలకు ఓటు హక్కు కల్పించిన మొట్టమొదటి దేశం ఫిన్లాండ్. ఈ హక్కు1906లో వచ్చింది అక్కడి ఆడవాళ్లకు. అప్పటి నుంచి ఆడవాళ్లు పనుల్లో, నాయకత్వంలో ఉండేందుకు మంచి ప్రోత్సాహం ఉంటుంది. మహిళా పార్లమెంటేరియన్ల పరంగా ప్రపంచంలోనే మూడో అగ్రదేశం ఇది. 

అవినీతి జీరో!

ఈ దేశంలో అవినీతి సున్నా! ఇప్పటివరకు ఈ దేశంలో పెద్ద స్కామ్​లేవీ జరగలేదు. ముందుముందు  అలాంటివి జరగకుండా ఉండేందుకు ఆ దేశం కఠిన చర్యలు తీసుకుంటుంది. క్రైమ్​ రేట్ దాదాపు సున్నా అని చెప్పొచ్చు. మనుషులన్నాక కొన్ని తప్పులు చేయడం సహజం అనేందుకు అక్కడో ఇక్కడో నేరాలు జరక్కపోవు. ఒకవేళ నేరం చేసి జైలుకి వెళ్తే...  అక్కడ దుర్భర పరిస్థితులు ఉండవు. ఫుడ్, పరిశుభ్రత విషయాల్లో ప్రపంచంలోనే టాప్ జైళ్లు ఉన్నాయక్కడ. ఫైవ్ ​స్టార్​ హోటల్స్​లా ఉంటాయట!

చదువుకు ఫీజులు నేరం

ప్రోగ్రామ్​ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎసెస్​మెంట్ టెస్ట్​ (PISA)లో ఫిన్​లాండ్​ దేశ విద్యార్థులు ముందంజలో ఉంటున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యావ్యవస్థ కలిగిన దేశాల్లో ఒకటిగా ఫిన్​లాండ్​కి గుర్తింపు ఉంది. ఫిన్​లాండ్​లో చదువు పూర్తిగా ఉచితం. పుస్తకాలు, పెన్, పెన్సిల్, బ్యాగ్ అన్నీ ఫ్రీ. ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికీ చాలా అవసరమని ఆ దేశం భావిస్తోంది. అక్కడ ఎక్కువశాతం ప్రభుత్వ పాఠశాలలే ఉంటాయి. అందుకు కారణం లేకపోలేదు. ఫిన్​లాండ్​ దేశంలో1970ల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్​లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.

దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ప్రాథమిక విద్య పూర్తి చేయాలనే రూల్ పెట్టారు. డబ్బున్నవాళ్ల పిల్లలు మంచి​ స్కూల్స్​లో చదువుతుంటే... సామాన్యులు క్వాలిటీ ఎడ్యుకేషన్​కి దూరమవుతున్నారని​ గ్రహించింది. దాంతో విద్యా వ్యవస్థని చేతుల్లోకి తీసుకున్న గవర్నమెంట్ ప్రైవేట్ విద్యాసంస్థలను రద్దు చేసింది. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయడం అక్కడ పెద్ద నేరం. కొన్ని స్కూళ్లను ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తున్నప్పటికీ వాటికి నిధులు ప్రభుత్వమే​ ఇస్తుంది. డే కేర్ సెంటర్​ నుంచి డిగ్రీ పట్టా పొందే వరకు ఉచిత విద్య అందిస్తుంది. చిన్న పాటి కార్మికుల నుంచి దేశాధ్యక్షుడి వరకు అందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవాల్సిందే.

మరెన్నో పాలసీలు

1990ల్లో మరిన్ని మార్పులు జరిగాయి. క్వాలిటీ ఎడ్యుకేషన్​, కొన్ని గవర్నమెంట్ పాలసీలు అమల్లోకి వచ్చాయి. అవి ఆ దేశ విద్యాసంస్థలు బాగుపడేందుకు సాయపడ్డాయి. అందరూ విద్యావంతులు కావాలన్నదే ఆ దేశ లక్ష్యం. అందుకే స్టూడెంట్స్ మధ్య తేడాలు చూపించే పరీక్షలు, మార్కులు వేసే పద్ధతికి స్వస్తి చెప్పారు. స్టూడెంట్​ టాలెంట్​ బట్టి ఎంకరేజ్ చేస్తారు. రకరకాల అంశాల్లో పిల్లల ప్రతిభ ఆధారంగా వాళ్ల సామర్ధ్యాన్ని టీచర్లు గుర్తిస్తారు. ఏడాది చివర్లో మ్యాథ్స్, సైన్స్​ సబ్జెక్ట్స్​లో పరీక్షలు పెట్టినా మార్కులు మాత్రం బయటపెట్టరు.

ఆ మార్కుల ద్వారా ఇంకెంత బాగా చెప్పాలనేది తెలుసుకుంటారు టీచర్లు. తాము చెప్పే సబ్జెక్ట్​ పిల్లలకు ఏమాత్రం అర్థం అవుతుంది అనేది టీచర్లు అంచనా వేసుకుంటారు. ఆ తర్వాతి ఏడాది టీచింగ్​ చేసే పద్ధతిలో మార్పులు చేసుకుంటారు. పరీక్షలు, స్టడీ అవర్స్​ లాంటివేం ఉండవు. వ్యాయామానికి కూడా చాలా ఇంపార్టెన్స్​ ఇస్తారక్కడ. అందుకే స్కూల్స్​లో  ప్లే గ్రౌండ్స్ చాలా పెద్దగా ఉంటాయి. ముఖ్యంగా ఎనిమిదేండ్ల లోపు పిల్లలకు మూడు గంటలు వ్యాయామం చేయించాలనే రూల్ ఒకటి ఉంది. అందుకే కాబోలు కొన్ని తరగతి గదుల్లో కుర్చీలకు బదులు ఎక్సర్​సైజ్ బాల్స్ కనిపిస్తాయి. 

ఏడేండ్లు దాటితేనే బడి

ఈ దేశంలో ఏడేండ్లు దాటాకే పిల్లల్ని స్కూల్​కి పంపిస్తారు. అప్పటివరకు డే కేర్​ సెంటర్లకు వెళ్లాలి. మొదటి ఆరేండ్లలో పాఠాలకు బదులు పిల్లలకు లెర్నింగ్ స్కిల్స్ నేర్పిస్తారు. అందరితో కలిసి ఆడుకోవడం, నిద్ర పోవడం, ఒకరికొకరు హెల్ప్​ చేసుకోవడం, కమ్యూనికేషన్ స్కిల్స్, జాలి, దయ, సామాజిక స్పృహ వంటి లైఫ్​ స్కిల్స్​ పిల్లలు అలవర్చుకునేలా ప్రోత్సహిస్తారు. పిల్లల్లో అన్నిరకాల డెవలప్​మెంట్ ఏడేండ్ల వయసు వచ్చే వరకు జరుగుతుంటుంది. అందుకని ఆ దేశంలో ఈ పద్ధతి ఫాలో అవుతారు. అప్పటివరకు తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి గడపడం చాలా ముఖ్యం. అది వాళ్ల మానసిక ఎదుగుదలకు ఎంతో మంచిదని భావిస్తారక్కడ. పదహారేండ్ల వరకు ఎలాంటి ఎగ్జామ్స్ పెట్టరు అక్కడ.  ఇంకో విషయం ఏంటంటే... ఎవరైనా పీహెచ్​డీ డిగ్రీ అందుకుంటే .. ఊరి ప్రజలంతా కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. 

నో యూనిఫాం, హోం వర్క్​

యూనిఫాం వేసుకోవడం అనేదాన్ని ఎప్పుడో పక్కన పెట్టేశారు. చదువు, పుస్తకాలు పిల్లలకు భారం కాకూడదని హోం వర్క్​ ఇవ్వడం ఆపేశారు. ఆరో తరగతి వరకు ఎటువంటి హోం వర్క్​లు ఉండవు. ఆ తర్వాతి తరగతుల పిల్లలకు హోం వర్క్ ఇచ్చినా అది అరగంటలో పూర్తయ్యేలా ఉండాలనేది రూల్. పిల్లల నిద్రకు చాలా ఇంపార్టెన్స్​ ఇస్తుంది ఫిన్​లాండ్​. అందుకే తొమ్మిది తర్వాత స్కూల్ మొదలై, మూడింటికల్లా పూర్తవుతుంది. హైస్కూల్​ చదువు పూర్తయ్యేవరకు హాఫ్​ డే స్కూల్స్. రోజుకి నాలుగు పీరియడ్లు మాత్రమే జరుగుతాయి. మిగతా టైంలో పిల్లలు నాలెడ్జ్ పెంచుకుంటారు. కొత్త విషయాలు  నేర్చుకుంటారు.

 టీచర్ ఉద్యోగం ఒక హోదా అక్కడ

ఈ దేశంలో డాక్టర్ల తర్వాత టీచర్లకే ఇంపార్టెన్స్ ఎక్కువ. టాలెంట్​ ఉన్న  టీచర్లను ఎంకరేజ్ చేస్తారక్కడ. అందుకే అక్కడ టీచింగ్ అనేది చాలా గొప్ప ఉద్యోగం. ఇక్కడ చాలామంది టీచర్లు అవ్వడానికి ఇష్టపడతారు. యూనివర్సిటీలో చదివేటప్పటి నుంచే టీచింగ్​ స్కిల్స్ నేర్చుకుంటారు. అలాగని టీచర్​ ఉద్యోగం అంత ఈజీగా రాదు. ఎలిమెంటరీ స్కూల్ టీచర్ కావాలంటే మాస్టర్ డిగ్రీ ఉండాల్సిందే. సెకండరీ స్కూల్ టీచర్ కావాలంటే పీహెచ్​డీ పూర్తి చేయాలి.

ప్రతి ఏడాది టీచర్ల సెలక్షన్​కు వచ్చే అప్లికేషన్స్​లో10 శాతమే ఎలిజిబుల్ అవుతాయి. సెలక్ట్ అయిన వాళ్లు దాదాపు యూనివర్సిటీ టాపర్లే అయి ఉంటారు. ఈ ఎంపికలో వివిధ దశలు ఉంటాయి. అవన్నీ దాటితేనే  టీచర్​ ఉద్యోగం వస్తుంది. అంతేకాదు.. ప్రపంచంలో తక్కువ పనిగంటలు, ఎక్కువ సెలవులు ఉన్న దేశం కూడా ఫిన్​లాండ్​. మొత్తం180 రోజులు మాత్రమే స్కూల్స్​ నడుస్తాయి. ఇక్కడ మనదేశాన్ని పోలిస్తే మన దగ్గర 240 రోజులు స్కూల్స్​ ఉంటాయి. అక్కడ ఒక టీచర్​ ఏడాదికి 600 గంటలు పాఠాలు చెప్తే... మనదేశంలో1700 గంటలు చెప్తారు.

వర్క్​ ప్లేస్​లో నో టైం పాస్​

ఫిన్​లాండ్​ దేశ ప్రజల సంతోషానికి గల కారణాల్లో ముఖ్యమైనది వర్క్​ లైఫ్​ బ్యాలెన్స్. వర్క్​ లైఫ్​ని బ్యాలెన్స్ చేయడానికి ఉద్యోగులు తక్కువ గంటలు పనిచేసుకునే వీలుంది. హాలీడేస్​ చాలా ఉంటాయి. ఫ్యామిలీ టైం, ఫ్లెక్సిబుల్ అవర్స్ వంటివి వాడుకోవచ్చు. ఈ దేశంలో పని ప్రదేశాల్లో టైంపాస్ చేయడం, డ్యూటీ ఎగ్గొట్టడం వంటివి అస్సలు చేయరు. 

పరిశుభ్రత

దేశ జనాభా55 లక్షల 49 వేలకుపైనే. అక్కడ కార్లు దాదాపు 40 లక్షలు ఉంటాయి. వరల్డ్​ హెల్త్​ ఆర్గనైజేష్​ (డబ్ల్యూహెచ్​ఓ) లెక్కల ప్రకారం ‘‘వరల్డ్ ప్యూర్​ ఇండెక్స్​’’లో ఫిన్​లాండ్​ది​ మొదటిస్థానం. అంటే అక్కడ పరిశుభ్రతకు ఎంత ఇంపార్టెన్స్​ ఇస్తారో అర్థం చేసుకోవచ్చు.  డబ్ల్యూహెచ్​ఓ రిపోర్ట్ ప్రకారం స్వచ్ఛమైన గాలి పరంగా ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది ఫిన్​లాండ్​. అలాగే నీళ్ల విషయంలో కూడా. గ్లాస్, ప్లాస్టిక్ చెత్తలను నూరు శాతం రీసైకిల్ చేస్తారు. ఎవరి ఇంటికైనా వెళ్లినప్పుడు చెప్పులు బయటే వదిలి వెళ్లాలి.

లైఫ్​ స్టయిల్ మెయింటెనెన్స్

  • చలి ఎక్కువగా ఉంటుంది. అందుకే కాబోలు కాఫీ తాగడాన్ని ఇష్టపడతారు. ఏడాదికి ఒక మనిషి దాదాపు12 కేజీల కాఫీ తాగుతాడు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. దాదాపు 360 రకాల కాఫీలు దొరుకుతాయి. కాఫీ మాత్రమే కాదు.. పాలు కూడా ఎక్కువగానే తాగుతారు. ఆ పాలు చాలా క్వాలిటీగా ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన పాలు ఫిన్​లాండ్​లోనే  దొరుకుతాయి. 
  • ఈ దేశంలో ‘సోనా’ ఎక్కువగా కనిపిస్తాయి. సోనా అంటే అదో రకమైన బాడీ థెరపీ. స్టీమ్​ బాత్ (ఆవిరి స్నానం)​ లాంటిది. ఇలాంటివి అక్కడ ప్రతి ఇంట్లో ఉంటాయి. ఈ స్టీమ్​ బాత్ వల్ల బాడీ రిలాక్స్ అయ్యి, ఫ్రెష్​గా ఫీలవుతారు.
  • ఈ దేశ ప్రజలు చాలా ఫిట్​గా ఉంటారు. మగవాళ్ల సగటు ఆయుర్దాయం 82 ఏండ్లు. ఆడవాళ్ల ఆయుర్దాయం 84 ఏండ్లు. మానసిక సమస్యలతో బాధపడేవాళ్లకు పాలసీలు, సర్వీస్​లు అందించి సపోర్ట్​ చేస్తుంది ప్రభుత్వం. మెంటల్​ హెల్త్ గురించి ఫిన్​లాండ్​లో అవేర్​నెస్ బాగా పెరుగుతోంది. 
  • ఈ దేశ ప్రజలు సంగీతాన్ని చాలా ఇష్టపడతారు. ఎంత ఇష్టమంటే ప్రతి ఇంట్లో ఒక మ్యుజీషియన్​ కనిపించేంత. హెవీ మెటల్ బ్యాండ్​ అయిన లోడీ ‘హార్డ్ రాక్ హల్లేలూయ’ సాంగ్​ని 1979లో పర్ఫార్మ్ చేసి యూరోవిజన్ సాంగ్ కాంటెస్ట్​లో గెలిచింది. 
  •  పెంపుడు జంతువుల్ని అమ్మకూడదు. ఒకసారి ఒక జంతువుని పెంచుకోవడం మొదలుపెడితే చివరి వరకు దాని బాగోగుల బాధ్యత వాళ్లదే.

ఒకరికొకరు

లాస్ట్​ వాలెట్ ఎక్స్​పరిమెంట్’’ అనే రీసెర్చ్​ 2022లో జరిగింది. ఆ పరిశోధనలో ప్రజల మధ్య నమ్మకం స్థాయి బాగా పెరిగిందని తెలిసింది. అదెలా తెలిసిందంటే...192 వాలెట్స్​ని ప్రపంచంలోని16 సిటీల్లో పడేశారు. అందులో హెల్సింకీలో12 వాలెట్స్ పడేస్తే 11 వాలెట్స్ తిరిగి యజమాని​ దగ్గరకి వచ్చి చేరాయి. అంటే వీళ్లు ఒకరికొకరు నమ్మకంగా, నిజాయతీగా ఉన్నట్టే కదా. కాబట్టి ఫిన్​లాండ్​​లో​ మీ ఫోన్ లేదా ల్యాప్​ టాప్‌‌ లాంటివి మిస్ చేసుకుంటే బాధపడక్కర్లేదు. తప్పకుండా అవి మీ దగ్గరకు వచ్చేస్తాయి.

అంతెందుకు పిల్లలు ఎవరి పర్యవేక్షణ లేకుండా ఇంటి నుంచి స్కూల్​కి లేదా ఆడుకోవడానికి పబ్లిక్ బస్​లో జర్నీ చేస్తుంటారు. ఆఫీస్​ బయట ఉన్న ఆవరణలో చంటి పిల్లల్ని స్ట్రోలర్స్​లో పడుకోబెట్టి పేరెంట్స్ ఆఫీస్​లో వర్క్ చేసుకుంటుంటారు. మధ్య మధ్యలో వచ్చి పిల్లల్ని చూసుకుంటుంటారు. ఒకవేళ పేరెంట్ వచ్చే లోపే పిల్లలు ఏడిస్తే.. అటు వైపు వెళ్లే వాళ్లు ఎవరైనా చూసి వాళ్లను ఊరుకోబెట్టి మరీ వెళ్తారు. ఇది వాళ్ల లైఫ్​ స్టయిల్​లో భాగమైపోయింది. ఫిన్నిష్​ కల్చర్​లో కమ్యూనిటీ ఇన్వాల్వ్​మెంట్ అనేది చాలా బలంగా ఉంటుంది. అదే ఓవరాల్ హ్యాపీనెస్​కి కారణం అవుతోంది. 

అక్కడంతే!

ఈ దేశ ప్రజలు గవర్నమెంట్ పెట్టిన నియమాలను తూ.చ. తప్పకుండా పాటిస్తారు. వాటిని బ్రేక్​ చేసే సాహసం చేయరు. ఎందుకంత భయం? అంటున్నారా...  అది భయం కాదు. క్రమశిక్షణ అంటుంది ఆ ప్రభుత్వం. ఉదాహరణకు ట్రాఫిక్​ రూల్స్​నే తీసుకుంటే... రూల్స్ తప్పితే చలానా వేసే పద్ధతి అంతటా ఒకటే. కానీ, ఇక్కడ మరో ట్విస్ట్ ఉంటుంది. చలానా అందరికీ ఒకేలా ఉండదు. అన్ని విషయాల్లో సమానత్వం పాటించే ఫిన్​లాండ్​ గవర్నమెంట్​ చలానా విషయంలో మాత్రం దానికి పూర్తి వ్యతిరేకం. ఆదాయాన్ని బట్టి చలాన్​లు ఉంటాయి. ఎక్కువ సంపాదిస్తే ఎక్కువ​, తక్కువ సంపాదిస్తే తక్కువ ఫైన్ వేస్తారన్నమాట. ఒకసారి నోకియా సీఈఓ కారు వేగంగా నడిపి లక్షా పదహారు వేల యూరోల జరిమానా కట్టాడు.

ఛాలెంజెస్​ అధిగమించి...

ప్రపంచంలోనే అత్యంత ఆనందంగా ఉన్న దేశాల్లో ఫిన్​లాండ్​ ఒకటి. అయినప్పటికీ ఈ దేశంలో కూడా ఎన్నో ఇబ్బందులు, సవాళ్లు ఎదురయ్యాయి. వాటన్నింటినీ ఎంతో ధైర్యంగా అధిగమించింది. ఈ దేశంలో వనరులు పుష్కలంగా ఉంటాయి. కానీ, ఒకానొక టైంలో అక్కడ పనిచేసేందుకు పనివాళ్లు తక్కువగా ఉండడం వల్ల దేశాభివృద్ధికి ఆటంకం కలిగింది. ఆ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు తమ దేశం ‘వచ్చి పని చేస్తాం’ అన్నవాళ్లకు సంతోషంగా వెల్​కమ్ చెప్పింది. 

ఫిన్​లాండ్​లో 2021నాటికి 5.2 మిలియన్ల జనాభా ఉంటే, అందులో పనిచేయగల సామర్థ్యం, వయసు ఉన్న వాళ్లు 65 శాతం మాత్రమే. ఇక వృద్ధుల విషయానికొస్తే.. 39.2 శాతంతో ప్రపంచంలోనే రెండోస్థానంలో ఉంది. దీని ప్రకారం 2030 నాటికి ఇది 47.5 శాతం పెరగొచ్చని ఐక్యరాజ్యసమితి  అంచనా వేసింది. పరిస్థితి ఇలా ఉండడంతో పని చేసే వాళ్ల సంఖ్యను పెంచుకునేందుకు ఫిన్​లాండ్​ చర్యలు చేపట్టింది.

దేశంలో ప్రతీ పని ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలంటే ఏడాదికి కనీసం దాదాపు 30 వేల మంది వలస రావాలని గ్రహించి ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ‘ఫిన్​లాండ్​లో ఫ్యూచర్​ని క్రియేట్ చేసుకోండి’ అనే స్లోగన్​తో విదేశీయులను ఆకర్షించేలా ప్రచారం చేపట్టింది. విదేశీయులను పెట్టుకునేందుకు ప్రైవేట్ కంపెనీల రూల్స్​ సులభతరం చేసింది. ఇతర దేశాల నుంచి వచ్చి స్థిరపడాలనుకునేవాళ్లకు ఫిన్​లాండ్​ దేశ పౌరసత్వం కూడా ఇస్తోంది. ఒకవేళ అక్కడ పనిచేయాలనుకుంటే ఇమ్మిగ్రేషన్ సదుపాయం కల్పిస్తోంది. ఇంటర్నెట్​, హెల్త్​ టెక్, డిజిటలైజేషన్, అత్యంత డెవలప్ అయిన ఇతర రంగాల్లో స్కిల్స్​ ఉన్న వాళ్లను స్వాగతిస్తోంది.

విదేశీ టాలెంట్​ని ఆకర్షించడం ద్వారా వెరైటీని పెంచి అవకాశాలను మెరుగుపరిచేందుకు, తర్వాతి తరం వరల్డ్ ఇంటర్నెట్ లీడర్​షిప్​ని స్థాపించడానికి ప్లానింగ్​, డిజైన్​ చేస్తోంది. రాబోయే పదేండ్లలో ఫిన్​లాండ్​ గవర్నమెంట్ ఏడాదికి పదిహేను వేలమంది విదేశీ విద్యార్థులను రప్పించాలని టార్గెట్ పెట్టుకుంది. భారత దేశం నుంచి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం(STEM) లో అపార జ్ఞానం ఉన్న వాళ్లను ఎంకరేజ్ చేయాలనుకుంటోంది. 

కొవిడ్​ వల్ల..

గత పదేండ్లలో ఫిన్​లాండ్​కు వలస వెళ్లేవాళ్ల సంఖ్య చాలా వరకు పెరిగింది. కొన్నేండ్ల పాటు అక్కడ పని చేసి తిరిగి స్వదేశానికి వెళ్లిపోతుంటారు. అలా 2019లో ఫిన్​లాండ్​ని విడిచి వెళ్లిన వాళ్లకంటే దాదాపు15 వేల మంది అదనంగా ఆ దేశానికి వచ్చినట్టు లెక్కలు చెప్తున్నాయి. అయితే, ఈ దేశాన్ని విడిచి వెళ్లిన వాళ్లలో విద్యావంతులే ఎక్కువగా ఉండడంతో దేశ అభివృద్ధికి దెబ్బ పడుతోంది. ఉద్యోగాల కోసం వచ్చినవాళ్లు కొవిడ్ ప్యాండెమిక్ టైంలో స్వదేశానికి వెళ్లిపోతున్నారు. దాన్ని ఆపేందుకు. స్టార్టప్​ల ఏర్పాటు, భార్యాభర్తలు ఉద్యోగం చేసుకునేందుకు అనుమతిచ్చినా ఆశించిన ఫలితం కనిపించలేదు. అయితే, కొవిడ్ తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయి. నెమ్మది నెమ్మదిగా ఫిన్లాండ్ గత వైభవాన్ని సంతరించుకుంటోంది. 

వలస వెళ్లాలనుకుంటే..

సంతోషకరమైన దేశం మాత్రమే కాదు.. భద్రత కలిగిన దేశం కూడా. అక్కడ క్రైమ్ రేట్ చాలా తక్కువ. అలాగే ఇక్కడ ఉద్యోగావకాశాలు చాలా ఎక్కువ. వేతనాలు కూడా ఎక్కువే. అంతేకాదు వర్క్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. సోషల్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ చాలా బాగా డెవలప్​ అయింది. వలస వెళ్లాలనుకునే వాళ్లకు ఈ దేశం బెటర్. అక్కడి ప్రజలు ఫిన్నిష్​తోపాటు ఇంగ్లిష్​ కూడా మాట్లాడతారు.

70 శాతం ఇంగ్లిష్​ ఫ్లూయెంట్​గా మాట్లాడగలరు. హెల్త్ కేర్ సిస్టమ్ బాగుంటుంది. దేశంలో ఎక్కడైనా మెడికల్ కేర్ అందుతుంది. స్కూల్‌‌, కాలేజీల్లో బేసిక్ మెడికల్ సర్వీస్​లు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే లిటరసీ రేట్​లో 99 శాతం ఉన్న దేశం ఇది. హై క్వాలిటీ ఆఫ్ లైఫ్​ ఇవ్వడంలో ప్రపంచం​లో మూడో స్థానంలో ఉంది. అక్కడికి వెళ్లి చదువుకోవాలంటే ఫీజులు కట్టాల్సి ఉంటుంది.

కొన్ని మైనస్​లు లేకపోలేదు!

చెప్పుకోదగ్గ మొత్తంలో జీతం ఉంటే ట్యాక్స్ కట్టాల్సిందే. కాంపిటీషన్ ఎక్కువ కాబట్టి జాబ్​ తెచ్చుకోవడం చాలా కష్టం. శీతాకాలం ఒక పక్క చలి కొరికేస్తుంటే మరో పక్క పగటి వెలుగు చాలా తక్కువగా ఉంటుంది. ఫిన్నిష్​ భాష నేర్చుకోవడం కాస్త కష్టమే. ఈ దేశంలో తొమ్మిది నెలలు విపరీతమైన చలి ఉంటుంది. ఆ టైంలో ఇక్కడి టెంపరేచర్ మైనస్ నాలుగు డిగ్రీలకి చేరుతుంది. జూన్ నుంచి జులై మధ్యలో అప్పుడప్పుడు 23 గంటలు కంటిన్యూగా సూర్యకాంతి ఉంటుంది. అర్థరాత్రి దాటాక కాసేపు సూర్యుడు మబ్బుల వెనక్కి వెళ్లి, అరగంట తర్వాత మళ్లీ వచ్చేస్తాడు. అందుకే ‘ల్యాండ్​ ఆఫ్ ది​ మిడ్ నైట్​ సన్’ అని పిలుస్తారు.

ఒక్కో ఏడాది దేశాల ర్యాంకింగ్​లో మార్పులు కనిపిస్తుంటాయి. టాప్​ పొజిషన్​లో ఉన్న దేశాలు కిందకి, కింద ఉన్నవి పైకి వెళ్తుంటాయి.  అయినా ఎక్కడుంటే ఏంటి? మనకంటూ ఒకరు తోడుగా ఉండాలి. మనం ఇతరులకు తోడుగా నిలవాలి అదే మెయిన్ కాన్సెప్ట్. నిజానికి ఏ దేశ పరిస్థితులు ఒకేలా ఉండవు. కాబట్టి సంతోషం కోసం హ్యాపీగా ఉండే దేశాలకు వెళ్లడం కంటే.. మన దేశంలోనే మనం హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలనే దానిపై దృష్టి పెట్టాలి. మనసుకు సంతృప్తినిచ్చేవి ఏంటో ఆలోచించి వాటిని ఆచరణలో పెట్టాలి. అప్పుడు హ్యాపీనెస్​ ఇండెక్స్​లో మొదటి స్థానాల్లో ఉన్న దేశాల ప్రజల్లాగానే సంతోషంగా ఉండొచ్చు. 

హెల్త్ సిస్టమ్

ఫిన్​లాండ్​లో పబ్లిక్ హెల్త్ కేర్ అందించడానికి ఫ్రీ సర్వీస్ ఉండదు. కానీ, ఫీజులు చాలా తక్కువ. పబ్లిక్ హెల్త్ కేర్ అనేది మున్సిపాలిటీల బాధ్యత. అందుకు పన్నుల ద్వారా, పేషెంట్ ఫీజు నుంచి కూడా నిధులు సేకరిస్తారు. ‘డిక్సీ ఆన్​ సోషల్, హెల్త్ కేర్ క్లయింట్​ ఫీజ్ యాక్ట్​’ ప్రకారం మున్సిపాలిటీలు మ్యాగ్జిమమ్ ఫీజుల వసూలు చేయొచ్చన్నమాట. 

ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్​లో ఇక్కడ పకడ్బందీగా పనిచేస్తుందని చెప్పొచ్చు. ప్రైమరీ సెంటర్​కి వెళ్లిన వ్యక్తిని టెస్ట్​ చేశాక.. సదరు వ్యక్తికి వచ్చిన జబ్బు క్రానిక్​ డిసీజ్​ అయితే వాళ్లను స్పెషలిస్ట్​ల దగ్గరకు వెంటనే రిఫర్ చేస్తారు. ప్రత్యేకంగా హెల్త్ కౌన్సెలింగ్​ సెంటర్​లు ఉంటాయి. హెల్త్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్​ అక్కడ. ప్రైమరీ సెంటర్​లో గర్భనిరోధక విషయాల నుంచి మెటర్నిటీ, చైల్డ్ వెల్ఫేర్​, మెడికల్ ఎగ్జామినేషన్స్ సర్వీస్​లు ఉంటాయి. వీటితో పాటు స్క్రీనింగ్, వ్యాక్సినేషన్, డెంటల్ సర్వీస్, స్కూల్ – స్టూడెంట్ హెల్త్ కేర్, మెంటల్ హెల్త్ సర్వీస్, ఎమర్జెన్సీ ట్రీట్​మెంట్, హోమ్ కేర్ సర్వీస్​లు కూడా ఉన్నాయి. 

ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ 

  •  ఫిన్​లాండ్​ దేశంలో బోలెడు సరస్సులు కనిపిస్తాయి. ఒక అంచనా ప్రకారం దాదాపు లక్ష సరస్సులు ఉంటాయి. అందుకే ఈ దేశాన్ని ‘కంట్రీ ఆఫ్​ లేక్స్’ అని కూడా పిలుస్తారు. అలాగే ‘ల్యాండ్ ఆఫ్​ థౌజండ్​​ లేక్స్’ అని కూడా అంటారు. 
  •  స్వీడన్​, ఫిన్​లాండ్​ దేశాలకు మధ్యలో ఒక గోల్ఫ్ కోర్ట్ ఉంది. ఇలా రెండు దేశాల మధ్య గోల్ఫ్​ కోర్ట్​ ఉండడం ప్రపంచంలో ఎక్కడా కనిపించదు.
  •     చాక్లెట్, క్యాండీలు తినడానికి బాగా ఇష్టపడతారు. సాల్మియాకి అనే స్పెషల్ క్యాండీని అనేక రకాల పండ్లను ఎండబెట్టి తయారుచేస్తారు. 
  •     ఫిన్​లాండ్ కరెన్సీ యూరో. ఒక యూరో దాదాపు 90 రూపాయలతో సమానం. 
  •     నోకియా మొబైల్ కంపెనీ ఫిన్​లాండ్​​ దేశానికి చెందినది.
  •     యాంగ్రీ బర్డ్స్ గేమ్​ని ఫిన్​లాండ్​ దేశానికి చెందిన కంపెనీ డిజైన్ చేసింది.
  •     ఆ దేశంలో జనాభా తగ్గిపోతుండడంతో.. ఎక్కువమంది పిల్లల్ని కనేవాళ్లకు ప్రతి నెలా వెయ్యి డాలర్లు ఇచ్చి ఎంకరేజ్ చేస్తోంది గవర్నమెంట్. 
  •     గాజు ఇగ్లూల్లో పడుకుని ఉత్తర ద్వీపాలను చూసే రిసార్ట్ ఒకటి ఉంది. 
  •     ఫిన్​లాండ్ దేశ జంతువు బ్రౌన్ బేర్. దాదాపు1500 బ్రౌన్​ బేర్​లు అక్కడి అడవుల్లో తిరుగుతుంటాయి.
  •     ఫిన్​లాండ్ పాస్​పోర్ట్​ ప్రపంచంలోనే అత్యంత పవర్​ఫుల్ పాస్​పోర్ట్​లలో మూడో స్థానంలో ఉంది. అంటే.. ఈ పాస్​పోర్టు ఉన్నవాళ్లు వీసా లేకుండా అనేక దేశాలకు వెళ్లొచ్చు. 
  •     ఉన్నత విద్యాస్థాయి ప్రపంచంలో మూడో స్థానం. 
  •     బిజినెస్ చేయడం, దాని డెవలప్​మెంట్​లో ఐరోపా దేశాల్లో మూడో స్థానం. 

పిల్లల సంక్షేమం ముఖ్యం

తల్లిదండ్రులు లేని పిల్లల్ని అనాధాశ్రమంలో ఉంచడం కనిపిస్తుంది మనకు. అదే ఫిన్​లాండ్​లో చూస్తే అనాథాశ్రమాలు ఉండవు. వాళ్ల కోసం ఒక వెల్ఫేర్​ సంస్థలు ఉంటాయి. అందులో వాళ్లకు ఎడ్యుకేషన్, హెల్త్ అన్నీ చూసుకుంటారు. ఆ పిల్లల బాధ్యత ఏ ఒక్కరిదో కాదు మొత్తం సొసైటీ మొత్తానిది అన్నమాట. పద్దెనిమిదేండ్లు వచ్చేవరకు సొసైటీనే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది.

పన్నులు ఇలా...

ఫిన్​లాండ్​లో ఆదాయం మీద పన్ను అనేది రెండు రకాలుగా విభజిస్తారు. అవి క్యాపిటల్​ ఇన్​కమ్​, ఎర్న్​డ్​ ఇన్​కమ్​. క్యాపిటల్​ ఇన్​కమ్​లో ఆస్తులు, ఎసెట్స్​, డివిడెండ్స్​, క్యాపిటల్​ గెయిన్స్​, అద్దె, వంటివి వస్తాయి. ఇవికాకుండా ఇతరత్రా వచ్చే ఆదాయం అంటే జీతాలు, పెన్షన్​ ఎర్న్​డ్​ ఇన్​కమ్​ కిందకు వస్తాయి. 30,000 యూరోల కంటే తక్కువ ఆదాయం ఉంటే 30 శాతం, 30,000 కంటే ఎక్కువ ఆదాయం ఉంటే 34 శాతం ట్యాక్స్​ కట్​ చేస్తారు. ఈ ట్యాక్స్​లతో వసూలయిన డబ్బును సోషల్ బెనిఫిట్స్ కోసం అంటే... నిరుద్యోగం, మెటర్నిటీ లీవ్ వంటి వాటికి వాడతారు.

ఆనంద రహస్యం

ఫిన్​లాండ్ ప్రజలు ‘ఇతరులతో పోల్చుకోవద్దు. మీ సంతోషం గురించి గొప్పగా చెప్పుకోండి’ అనే సూత్రాన్ని ఫాలో అవుతారు. ముఖ్యంగా సంపద, విలాసవంతమైన వస్తువుల గురించి బయటకు చెప్పుకోవాల్సిన అవసరం లేదనేది గట్టిగా నమ్ముతారు. ఫిన్​లాండ్​కి చెందిన మెంటల్ హెల్త్ ఎక్స్​పర్ట్స్ అందుకు కొన్ని టిప్స్ కూడా చెప్తుంటారు.

 టిప్ 1: సంతోషాన్నిచ్చే వాటిపై ఎక్కువ ఫోకస్ చేయాలి. సక్సెస్ మీద కాస్త తక్కువ ఫోకస్ పెట్టాలి. ఇతరులతో పోల్చుకోవడానికి బదులు నిజంగా సంతోషాన్నిచ్చేది ఏదో దాన్ని అర్థం చేసుకోవాలి. 

టిప్ 2: 2021 సర్వే ప్రకారం... 87 శాతం ఫిన్​లాండ్ ప్రజలు ప్రకృతి చాలా ముఖ్యం అనేది నమ్ముతారు. ప్రకృతి మనసుకు ప్రశాంతతను, శక్తిని ఇస్తుంది. ప్రకృతితో ఎక్కువసేపు గడపడం  వల్ల వ్యక్తిగత అభివృద్ధి అర్థం అవుతుంది. జీవశక్తి పెరుగుతుంది. అందుకే ఇంట్లో పచ్చదనం కనిపించేలా చేసుకోవడం కాదు. జీవితం కూడా పచ్చగా ఉండే మార్గాలు వెతకాలి. 

ప్రకృతితో స్ట్రాంగ్​ కనెక్షన్​ ఉన్నవాళ్లకు ఒత్తిడి తక్కువ ఉంటుంది. సంతోషం పెరుగుతుంది. అందుకే ఆ దేశం అడవులు, సరస్సులు వంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంటుంది. ఫిన్​లాండ్​లో ఉద్యోగులు వేసవికాలంలో నాలుగు వారాలు... అంటే దాదాపు నెల రోజులు హాలీడేకి వెళ్లొచ్చు. ఆ టైంలో ప్రకృతిలో సేదతీరేందుకు ఎక్కువ మంది ప్లాన్ చేసుకుంటారు. ఫిన్​లాండ్​లోని చాలా సిటీల్లో మొక్కలు ఎక్కువగా కనిపిస్తాయి.

ఉద్యోగం లేదన్న బెంగ లేదు

ఫిన్​లాండ్​లో 2015 నుంచి ఎంప్లాయిమెంట్​ సిస్టమ్​ మెరుగుపడింది. ఆర్థికంగా  కూడా పరిస్థితులు మారాయి. దాంతో పనిచేసే గంటలు పెరగడంతో వేతనాలు కూడా పెరిగాయి. ఎంప్లాయిమెంట్ రేట్ నెమ్మదిగా పెరుగుతోంది. అకౌంటెంట్​, కిండర్​ గార్టెన్​ టీచర్​, నర్స్​, ప్రోగ్రామర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉద్యోగాలకు డిమాండ్ ఎక్కువ. ఈ ఉద్యోగాల్లో ఉన్న వాళ్లు నెలకి దాదాపు 4, 690 యూరోల వరకు సంపాదించే అవకాశం ఉంది.

వేతనం మినిమమ్ ఇంత అని ఉండదు. లీగల్​ లేబర్ అగ్రిమెంట్​ ఉండదు. ఏ సెక్టార్​లో అయినా జీతాలు బాగుంటాయి. వారానికి 40 గంటలు పనిచేస్తారు. ప్రతి వారం వీక్​ ఆఫ్ ఉంటుంది. ఓవర్​ టైం చేస్తే దానికి తగిన వేతనం ఇస్తారు. ఈ దేశంలో ఉద్యోగం లేని వాళ్లకు, అనుకోని కారణాల వల్ల ఉన్న జాబ్ పోయిన వాళ్లకు మరో ఉద్యోగం వచ్చేవరకు నిరుద్యోగ భృతి ఇస్తుంది ప్రభుత్వం. అలాగే ఉద్యోగం పోయిన వాళ్లకు ఉన్న స్కిల్స్​ బట్టి ట్రైనింగ్ ఇచ్చి మళ్లీ జాబ్​లో చేరే ఏర్పాట్లు ఉన్నాయక్కడ.

స్పోర్ట్స్ విత్ ఫన్

ఈ దేశ ప్రజలు స్పోర్ట్స్ ఆడడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే ఇక్కడ ఐస్​ స్కేటింగ్, స్కీయింగ్, హైకింగ్ వంటి రకరకాల స్పోర్ట్స్ కనిపిస్తాయి. వీటితోపాటు కొన్ని ఫన్నీ గేమ్స్​ కూడా ఉన్నాయి. అవి.. వైఫ్ క్యారీయింగ్ : భుజాలపై భార్యని ఎత్తుకుని పరుగెత్తాలి. ఈ పోటీలో గెలిచిన వాళ్లకు ఒక ట్రోఫీతోపాటు, తమ భార్య ఎంత బరువుందో అంత బీర్​ ఫ్రీగా ఇస్తారు. మస్కిటో స్క్వాటింగ్ : సమ్మర్​లో సరస్సుల దగ్గర చాలా దోమలు ఉంటాయి. అందువల్ల మస్కిటో స్క్వాషింగ్ గేమ్​ పెట్టారు. ఎవరు ఎక్కువ దోమల్ని చంపుతారో వాళ్లకు ఛాంపియన్​ షిప్ టైటిల్ ఇస్తారు. గెలిస్తే కింగ్​ ఆఫ్​ మస్కిటో కిల్లర్ పేరుతో ప్రైజ్ ఇస్తారు.

పాలు పితికేటప్పుడు స్టూల్​ని తన్నడం, చీమల పుట్ట మీద కూర్చోవడం, చిత్తడి నేలలో ఫుట్​బాల్ ఆడడం, గుర్రపు బొమ్మలపై స్వారీ చేయడం (హాబీ హార్స్), ఎయిర్ గిటార్.. మొబైల్ ఫోన్​ థ్రోయింగ్.. మొబైల్ వల్ల ఫ్రస్ట్రేషన్​లో ఉన్నవాళ్లు వీలైనంత దూరంగా వాటిని విసిరేసే గేమ్​లో పార్టిసిపేట్ చేయొచ్చు.  

ఇండియా ఎందుకు...

హ్యాపీనెస్ సర్వే రిపోర్ట్​లో వందకుపైగా దేశాలు ఉంటే ఇండియా వంద దేశాల తర్వాతి స్థానాల్లో ఉంటోంది. అలా ఎందుకంటే...ఆదాయం తగ్గడం, నిరుద్యోగం : కొవిడ్​ –19 మహమ్మారి2020లో ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసి పడేసింది. దాంతో చాలా దేశాలు లాక్​డౌన్​ విధించాయి. వాటిలో మనదేశం కూడా ఒకటి. నిజానికి ఆక్స్​ఫర్డ్ యూనివర్సిటీ స్ట్రింజెన్సీ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో అత్యంత స్ట్రిక్ట్​గా లాక్​డౌన్​ పాటించిన దేశం భారత్​ అని చెప్పింది. ఈ లాక్​డౌన్​ వల్ల మనదేశ ఆర్థిక వ్యవస్థ చాలావరకు దెబ్బతిన్నది.

దాంతో వలసలు పెరిగిపోయాయి. జీవనోపాధి లేక ఆదాయం తగ్గింది. అంతేకాకుండా లాక్​డౌన్​ రూల్స్ వల్ల ఏప్రిల్ 2020 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో19 శాతం, అర్బన్​లో 41 శాతం ఆదాయం తగ్గింది. ఈ కారణాల వల్ల ఆదాయాలు 23.9 శాతానికి పడిపోగా, దాదాపు 24 శాతం నిరుద్యోగం ఏర్పడింది. ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే... మనదేశంలో దాదాపు 90 శాతం మంది అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్నారు. తద్వారా వాళ్లు సామాజిక భద్రత, పొదుపు, ఆదాయ భద్రతని కోల్పోయారు. కొవిడ్ తర్వాత ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా కోలుకుంటోంది.

అవినీతి : కరప్షన్​ పర్సెప్షన్ ఇండెక్స్’’ (సీపీఐ) 2020 ప్రకారం... 90 నుంచి వంద మధ్య స్కోర్ ఉంటే ఆ దేశం అవినీతి రహితం. 0 నుంచి 9 మధ్య స్కోర్ ఉంటే విపరీతమైన అవినీతి ఉన్న దేశం. అయితే, ఇందులో ఇండియా స్కోర్ 40. పోలీసు స్టేషన్​కి వెళ్లే వాళ్లలో దాదాపు 42 శాతం లంచం ఇస్తున్నట్టు ఒక సర్వే చెప్పింది. అధికారిక పత్రాలు, గుర్తింపు పత్రాల వంటి వాటిల్లో కూడా లంచాలు లేనిదే పని కావట్లేదు.

అలా పలు రకాలుగా అవినీతి జరుగుతోంది.సామాజిక మద్దతు లేకపోవడం : సోషల్ సపోర్ట్ విషయంలో నేషనల్ స్కోర్ ఎలా ఉందంటే... సున్న లేదా ఒకటిగా ఉంది. ఒకరికి సమస్య వచ్చిందంటే... రిలేటివ్స్ లేదా ఫ్రెండ్స్​ని సాయం అడిగేందుకు  ఎవరైనా ఉన్నారా అని వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఇదే విషయం మీద 2020లో చేసిన సర్వేలో 95 దేశాల్లో ఇండియా స్కోర్​ 92వ స్థానం కంటే దిగువన ఉంది. 

అయితే ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. 2021 తర్వాత తెలియని వాళ్లకు సాయం చేసే విషయంలో భారత్​ చాలా మెరుగ్గా ఉంది. ఆ విషయంలో కొంత శాతం పెరిగిందని గుర్తించాలి. అలాంటివి గుర్తించకుండా ఒకే రకమైన కొలమానంతో చూడడం సరికాదని అంటున్నారు కొందరు. కేవలం కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఒక దేశం ఎలా ఉందో ఎలా నిర్ణయిస్తారు? అని ప్రశ్నిస్తున్నారు కూడా. 

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య ఏడాది కాలానికి పైగా యుద్ధం జరిగింది. ఇప్పటికీ ఆ యుద్ధ వాతావరణంలోనే భయం భయంగా బతుకుతున్నారు ఉక్రెయిన్ ప్రజలు. అయినా సంతోష సూచిలో మాత్రం ఈ రెండు దేశాలు వందో ర్యాంకుకు పైనే ఎలా ఉన్నాయి? అనే ప్రశ్న వస్తుంది. నిజానికి ఆ రెండు దేశాలు ఆర్థికంగా చాలా నష్టపోయాయి. ఉక్రెయిన్​లో అయితే లక్షల సంఖ్యలో ప్రజలు వలస బాట పట్టారు. అక్కడే ఉన్న వాళ్లు క్షణక్షణం భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. అయితే, దేశం కోసం స్వచ్ఛందంగా సేవ చేయడం, కరుణ చూపించడం, ఉన్నంతలో ఇతరులకు పంచడం, ఒకరికొకరు తోడుగా నిలవడం, యుద్ధంలో గాయపడిన వాళ్లకు సేవలందించడం వంటివి ప్రజల్లో శాటిస్​ఫ్యాక్షన్ లెవల్స్ పెంచుతాయని చెప్పారు ఈ ఇండెక్స్ రూపకర్తలు. 

ఆ తర్వాత మారింది 

మనదేశం ఇప్పటికే చాలా దేశాలకు సేవలు అందించింది. శ్రీలంకకు వ్యాక్సిన్​లు, అఫ్గానిస్తాన్​కు నిత్యావసరాలు, మెడికల్ సామాగ్రి అందించింది. అంతెందుకు భారత్​తో ఎప్పుడెప్పుడు కయ్యం పెట్టుకోవాలా? అని ఎదురుచూసే పాకిస్తాన్​కి కూడా మెడిసిన్ సర్వీస్​లు చేసింది.

మనీష పరిమి