ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులో దేశ అత్యున్నత పదవి చేపట్టిన ఫిన్లాండ్ ప్రధానమంత్రి సనా మారిన్ తన వైవాహిక జీవితానికి స్వస్తి పలికారు. భర్త మార్కస్ రైకోనెన్ నుంచి విడిపోనున్నారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. తాము విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్లు ప్రకటించారు.
వ్యాపారవేత్త, మాజీ ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్ అయిన మార్కస్ రైకోనెస్‌తో సనా మారిన్ కొన్నాళ్ల పాటు సహజీవనం చేశారు. 2019లో సనా ఫిన్లాండ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఏడాది తర్వాత.. 2020లో ఆగస్టులో వీరు వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఐదేళ్ల కుమార్తె ఉంది. అయితే పెళ్లైన మూడేళ్లకే ఈ జంట తమ వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ తాజాగా విడాకుల కోసం దరఖాస్తు చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు.
‘మేమిద్దరం చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులం. కలిసి పెరిగాం. 19 ఏళ్లుగా కలిసే ఉన్నాం. ఇప్పుడు మేమిద్దరం విడాకులకు దరఖాస్తు చేసుకున్నాం. ఇకపై మంచి స్నేహితులుగానే ఉంటాం. మా ప్రియమైన కుమార్తెకు తల్లిదండ్రులమే. ఒక కుటుంబంగా మా కుమార్తె కోసం సమయాన్ని వెచ్చిస్తాం’ అని సనా మారిన్ చెప్పుకొచ్చారు.
2019 డిసెంబరులో సనా మారిన్ ఫిన్లాండ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటికి ఆమె వయసు 34 ఏళ్లు. ప్రపంచంలోనే అతి పిన్న వయసులో ప్రధాని పదవి చేపట్టిన వ్యక్తిగా ఆమె అరుదైన ఘనత సాధించారు. కొవిడ్ సమయంలో ఎన్నో నూతన విధానాలను అమల్లోకి తెచ్చి ఐరోపా సమాఖ్యతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.
ప్రజాధనం వ్యయం, పార్టీల్లో పాల్గొనడం వంటి వ్యవహారాలపై విమర్శలు రావడంతో సనా మారిన్ పాపులారిటీ తగ్గిపోయింది. దీంతో మారిన్ రాజీనామా చేశారు. అయితే.. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతున్నారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సనా మారిన్ పార్టీ ఓటమిపాలైంది. కన్జర్వేటివ్ పార్టీ (ఎన్‌సీపీ) విజయం సాధించింది. దీంతో త్వరలోనే ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అప్పటిదాకా మారిన్ ప్రధానిగా కొనసాగనున్నారు.