![తెలుగు రాష్ట్రాల్లో రూ.800 కోట్ల లోన్లు ఇస్తం](https://static.v6velugu.com/uploads/2023/06/Fintech-company-Kinara-Capital-announce-800-crore-loans-in-Telugu-states_E0aeKu67Ml.jpg)
హైదరాబాద్, వెలుగు: ఫిన్‌టెక్ కంపెనీ కినారా క్యాపిటల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని ఎంఎస్ఎంఈలకు 2024 ఆర్థిక సంవత్సరంలో తనఖా లేకుండా రూ.800 కోట్ల విలువైన బిజినెస్ లోన్లు ఇస్తామని ప్రకటించింది. ఈ సంస్థ 2016 నుంచి తెలుగు రాష్ట్రాల అర్బన్, సెమీ-అర్బన్ ప్రాంతాలలోని ఎంఎస్ఎంఈలకు 20 వేలకు పైగా లోన్లను అందించింది. వీటి విలువ రూ.1,200 కోట్లు. 2022 నుంచి 2023 వరకు తమ ఏయూఎం (అసెట్స్ అండర్ మేనేజ్మెంట్) 190శాతం వరకు పెరిగిందని కంపెనీ ప్రకటించింది.
ఈ ప్రాంతాల్లో 16 వేల మందికి ఉద్యోగాలను ఇచ్చామని తెలిపింది. ఆహార ఉత్పత్తులు, నిర్మాణ వస్తువులు, ఎలక్ట్రికల్స్, ఫ్యాబ్రికేషన్, చెక్క వస్తువులు, మెటల్ పార్టులు, ఫ్యాషన్ కంపెనీలకు ఎక్కువగా లోన్లు ఇచ్చామని సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తిరునావుక్కరసు వెల్లడించారు. ‘‘మేం ఎంఎస్ఎంఈలకు దీర్ఘ, స్వల్పకాలిక వర్కింగ్ క్యాపిటల్, అసెట్ కొనుగోలు (మెషినరీ కొనుగోలు) బిల్ డిస్కౌంటింగ్ లోన్లు ఇస్తాం. వీటి విలువ రూ. లక్ష నుంచి- రూ.30 లక్షల వరకు ఉంటుంది. వడ్డీరేట్లు 20 శాతం నుంచి 26 శాతం వరకు ఉంటాయి.
మహిళా ఎంట్రప్రిన్యూర్లకు వడ్డీపై 1-2శాతం వరకు డిస్కౌంట్ ఉంటుంది. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌లో మాకు 27 శాఖలు ఉన్నాయి. మా ఎన్పీఏలు 2 శాతం దాకా ఉన్నాయి. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లోని వందకుపైగా ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నాం. త్వరలో రాజస్థాన్ లేదా మధ్యప్రదేశ్‌లో బిజినెస్ మొదలుపెడతాం. ఈ ఏడాది తెలంగాణలో కొత్తగా ఎనిమిది శాఖలను ఏర్పాటు చేస్తాం. ప్రతి ఏడాది ఒక్క రాష్ట్రంలో అడుగుపెడతాం. ఎంఎస్ఎంఈల కోసం బిజినెస్ క్రెడిట్‌కార్డ్ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నాం”అని ఆయన వివరించారు.