భారతదేశంలో హిందూ మహిళలు మంగళసూత్రానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం.. మహిళలు మంగళసూత్రాన్ని తమ అయిదోతనంగా భావిస్తారు. అటువంటి పవిత్రమైన మంగళసూత్రాన్ని కుక్క గొలుసుతో పోల్చింది గోవాకు చెందిన ఓ మహిళా ప్రొఫెసర్. గోవాలోని ‘పనాజీస్ వీఎమ్ సాల్గోకర్ కాలేజ్ ఆఫ్ లా’లో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శిల్పాసింగ్ ఈ వాఖ్యలు చేసింది. ఆమె ఏప్రిల్ 21 మంగళసూత్రాన్ని కించపరుస్తూ తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని గోవాకు చెందిన రాష్ట్రీయ హిందూ యువ వాహిని సీరియస్‌గా తీసుకుంది. సంస్థకు చెందిన రాజీవ్ ఝా.. సదరు పోస్ట్ పెట్టిన శిల్పా సింగ్‌పై పోలీస్ స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. శిల్పాసింగ్ కావాలనే ఒక మతాన్ని కించపరుస్తూ వాఖ్యలు చేస్తుందని.. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు పెడుతుందని రాజీవ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆమె వెంటనే హిందువులను క్షమాపణ కోరాలని తెలిపాడు.
‘శిల్పాసింగ్ నా ఫేస్‌బుక్ స్నేహితురాలు కాదు. ఆమె నా ఫ్రెండ్స్‌కు ఫ్రెండ్. మా ఇద్దరికీ మ్యూచ్‌వల్ ఫ్రెండ్స్ ఉన్నారు. అందుకే శిల్పా పెట్టిన పోస్ట్ నాకు కనిపించింది. ఆమె ఏప్రిల్ 21న ఆ పోస్ట్ పెట్టింది. నేను మొదటగా అక్టోబర్ 28న పనాజీ పోలీసులను సంప్రదించాను. శిల్పా బహిరంగ క్షమాపణ కోరాలని నా ఫిర్యాదులో పోలీసులను కోరాను. కానీ పోలీసులు స్పందించలేదు. దాంతో మరుసటి రోజు అక్టోబర్ 29న మళ్ళీ కొత్తగా ఫిర్యాదు చేశాను. శిల్పాకు ఏమతమైనా నచ్చితే ఆమె ఆలోచనలు ఆమెలోనే ఉంచుకోవాలి కానీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ.. ఇతర మతాలను కించపరచకూడదు. ఒక ప్రొఫెసరే ఇలా చేస్తే.. ఆమె విద్యార్థులకు ఏం నేర్పిస్తుంది. హిందూ మతాన్ని కించపరుస్తూ పోస్ట్ పెట్టింది శిల్పాసింగ్ కాబట్టి నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను. లేకపోతే నేరుగా కాలేజీకి వెళ్లి సంజాయిషీ అడిగేవాడిని. అయినా కూడా ఆమె తన ప్రాణాలకు ముప్పు ఉందని అక్టోబర్ 30న పోలీసులకు ఫిర్యాదు చేసింది’ అని రాజీవ్ అన్నారు.
తన ఫేస్‌బుక్ పోస్ట్ మీద ఆరునెలల తర్వాత ఛాన్సలర్, యూనివర్సిటీలకు ఫిర్యాదు చేయడంపై ప్రొఫెసర్ శిల్పాసింగ్ సందేహం వ్యక్తం చేసింది. ‘నేను నా విద్యార్థులకు ఉదాహరణలతో సహా పాఠాలు భోదిస్తాను. వారికి పాఠాలు అర్థమయ్యేలా చెప్పడం నా బాధ్యత. నా పరువు తీసి, నన్ను అవమానించడానికే కొందరు ఈ కుట్ర చేస్తున్నారు. నా ఫేస్‌బుక్ పోస్టులు ఏవైనా ఎవరికైనా బాధ కలిగించినట్లయితే నన్ను క్షమించండి. నా చిన్నతనం నుంచి మహిళల పెళ్లి గురించి కొన్ని సందేహాలున్నాయి. మహిళల కోసం మాత్రమే కొన్ని ఆచారాలు ఎందుకు ఉన్నాయి. పురుషుల కోసం ఎందుకు లేవు. కొంతమంది నా గురించి ఒక తప్పుడు అభిప్రాయం సృష్టించారు. నేను మత వ్యతిరేకిని కాదు. దేవుడిని ద్వేషించే నాస్తికురాలు అని నన్ను అనటం చాలా బాధగా ఉంది’ అని శిల్పా సింగ్ అన్నారు. కాగా.. గోవాకు చెందిన వివిధ విద్యా సంస్థల ఉపాధ్యాయులు శిల్పాసింగ్‌కు మద్ధతుగా నిలిచారు.
రాజీవ్ ఝూ, శిల్పాసింగ్ ఒకరిపై ఒకరు ఇచ్చిన రెండు ఫిర్యాదులను నమోదు చేసి విచారించనున్నట్లు ఉత్తర గోవా ఎస్పీ ఉత్కృష్ట్ ప్రసూన్ తెలిపారు. ‘శిల్పా సింగ్ పై ఐపీసీ సెక్షన్ 295-ఎ (మతపరమైన భావాలను కించపరచడం) కింద కేసు పెట్టబడింది. రాష్ట్రీయ హిందూ యువ వాహిని సభ్యుడు రాజీవ్‌పై ఐపీసీ సెక్షన్లు 504 (ఉద్దేశపూర్వకంగా అవమానించడం), 506 (బెదిరింపు) మరియు 509 (మహిళను అవమానించడం) కింద కేసు నమోదు చేశాం’ అని ఎస్పీ ప్రసూన్ తెలిపారు.
For More News..