రాజ్యాంగాన్ని కాపాడాలంటే ప్రధాని మోడీని చంపేందుకు సిద్ధంగా ఉండండి అంటూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి రాజా పటేరియా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పన్నా జిల్లా పొవై తహసీల్‌లో కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో పటేరియా పై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా... రాజా పటేరియాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు ఆయన పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావాడంతో రాజా పటేరియా వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ప్రధాని మోడీని చంపడం అంటే ఎన్నికల్లో మోడీని ఓడించాలనే అర్థంలో తాను మాట్లాడానని అన్నారు. తాను మహాత్మా గాంధీ అనుచరుడినని.. హింసను ప్రోత్సహించబోనని అన్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ మనస్తత్వాన్ని ఈ వీడియో క్లిప్ ప్రతిబింబిస్తోందని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ‘‘కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్రకు సంబంధించిన నిజమైన చిత్రం ఇది. కాంగ్రెస్ పార్టీ మోడీని ఓడించలేదు, అందుకే ఆయనను చంపాలనుకుంటోంది” అని ఆయన వ్యాఖ్యానించారు.