కోహ్లీ రెస్టారెంట్ లో అసలు ఏం జరిగింది.. పోలీసుల రైడ్ ఎందుకు..?

కోహ్లీ రెస్టారెంట్ లో అసలు ఏం జరిగింది.. పోలీసుల రైడ్ ఎందుకు..?

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో 'వన్8 కమ్యూన్' పేరుతో రెస్టారెంట్లు, పబ్‍లు ఉన్న విషయం తెలిసిందే. ఈ మధ్యనే హైదరాబాద్‌లో కూడా దీనిని లాంచ్ చేశారు. వీటిలో ఒకటైన బెంగళూరులోని ఎమ్‌జీ రోడ్డులో ఉన్న వన్8 కమ్యూన్‍ రెస్టారెంట్ కమ్ పబ్‍పై పోలీసులు ఎఫ్‍ఐఆర్ నమోదు చేశారు. అనుమతించిన సమయానికి మించి తెరిచి ఉంచుతున్నారనే కారణంతో ఈ కేసు నమోదు చేశారు. దాని చుట్టుపక్కల ఉన్న మరో నాలుగు సంస్థలపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

అసలేం జరిగిందంటే..?

సెంట్రల్ బెంగుళూరులోని అనేక రెస్టారెంట్లు, పబ్‌లు నిర్ణీత సమయానికి అర్ధరాత్రి ఒంటిగంటకు మించి పనిచేస్తున్నాయని ఫిర్యాదుల నేపథ్యంలో జూలై 6న స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ తెల్లవారుజామున 1.20 గంటల సమయంలో వన్8 కమ్యూన్‌ను సందర్శించగా.. అప్పటికీ పబ్‌ తెరిచివుంది. దాంతో, అనుమతించిన సమయ వేళలను ఉల్లంఘించినందుకు కర్ణాటక పోలీసు చట్టం కింద వన్8 కమ్యూన్ సహా మరో నాలుగు సంస్థలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

స్థానిక నిబంధనల ప్రకారం అర్ధరాత్రి 1:00 గంట వరకు మాత్రమే పబ్‌‌లను తెరిచి ఉంచాలి. అయితే, వన్8 కమ్యూన్ పబ్ సహా మరికొన్ని తెల్లవారుజామున 3 గంటల వరకు తెరిచి ఉంటున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు రైడ్ చేశారని సమాచారం.

మరిన్ని వార్తలు