- గ్యాస్ ఏజెన్సీ తోపాటు మరో భవనానికి వ్యాప్తి
- తప్పిన ప్రాణాపాయం.. లక్షల్లో ఆస్తినష్టం
శంషాబాద్,వెలుగు: ఓ స్క్రాప్ గోడౌన్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని రాళ్లగూడ రోడ్డులో ఘటన జరిగింది. కేబీఎన్ స్క్రాప్ గోడౌన్ వెనకాల ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకు నిప్పు పెట్టగా శుక్రవారం మంటలు చెలరేగి గోడౌన్ కు.. దాని పక్కనే హాస్టల్ బిల్డింగ్ కు వ్యాపించాయి. అంతేకాకుండా ఆ పక్కనే ఉన్న ప్రియాంక గ్యాస్ ఏజెన్సీ భవనానికి కూడా మంటలు అంటుకుని భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. స్థానికులు చూసి గ్యాస్ షాపు ఓనర్ కు సమాచారం అందించారు. గ్యాస్ ఏజెన్సీ వర్కర్లు గోడౌన్ లోని 80 సిలిండర్లను తరలించారు. గోడౌన్ మంటలను ఆర్పేందుకు ట్యాంకర్ తో నీళ్లు చల్లినా లాభం లేదు. స్థానికులు పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. రెండు ఫైర్ ఇంజన్లు వచ్చి దాదాపు 5 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. సుమారు రూ.14 లక్షల నుంచి15 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని స్క్రాప్ గోడౌన్ ఓనర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి ఆర్జీఐఏ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికులు మాట్లాడుతూ.. శంషాబాద్ లో ఫైర్ స్టేషన్ లేకపోవడంతో ప్రమాదం జరిగిన ప్రతిసారి మహేశ్వరం, రాజేంద్రనగర్ నుంచి ఫైర్ ఇంజన్లు వచ్చే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండ్ల మధ్యలో స్క్రాప్ గోడౌన్ లకు మున్సిపల్ అధికారులు అనుమతి ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ప్రమాదం ఉదయం పూట జరగడంతో ప్రాణ నష్టం లేదని, అదే రాత్రి జరిగి ఉంటే పక్కన హాస్టల్ లో 200 మంది, ప్రియాంక గ్యాస్ ఏజెన్సీ భవనంపైన మరో హాస్టల్ లో 100 మంది వరకు ప్రమాదంలో పడేవారని భయాందోళన వ్యక్తంచేశారు. ప్రమాద స్థలాన్ని శంషాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మా మహేందర్ రెడ్డి, స్థానిక టీఆర్ఎస్ నేతలు కొనమల శ్రీనివాస్ కౌన్సిలర్ జహంగీర్ ఖాన్, బీజేపీ నేతలు రాజిరెడ్డి, మెండే కుమార్ యాదవ్ పరిశీలించారు.