హైదరాబాద్: హిమాయత్ నగర్లోని మినర్వ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. హోటల్లోని కిచెన్ ఎగ్జాస్ట్ నుంచి మంటలు రేగాయి. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. స్థానికులు ఇచ్చిన సమాచారం అందుకున్న నారాయణగూడ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఏ మేరకు ఆస్తి నష్టం జరిగిందన్నది తెలియరాలేదు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
హైదరాబాద్ లో మరో చోట కూడా అగ్ని ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్వేల్ రైల్వే స్టేషన్ వద్ద లారీ పార్కింగ్‌లో షార్ట్ సర్క్యూట్‌తో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు ఎగసి పడుతున్నాయి. మంటలకు తోడు గాలి, దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానికులు చాలా ఇబ్బందిపడ్డారు. షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు రేగి మెకానిక్ షెడ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. నష్టం10 లక్షల వరకూ ఉండొచ్చని అంచనా.