కామారెడ్డి, వెలుగు: లింగంపేట మండలం ఎల్లారం సమీపంలోని మోడ్రన్ గోదాంలో శుక్రవారం రాత్రి చెలరేగిన మంటల్లో 2. 75 లక్షల గన్నీ బ్యాగులు కాలి బూడిదయ్యాయి. బ్యాగులకు ఉండే కెమికల్కోటింగ్ప్రభావమో, మరే కారణమో కానీ.. అకస్మాత్తుగా చెలరేగిన మంటల కారణంగా సుమారు రూ. 2. 20 కోట్లు నష్టం జరిగిందని ఆఫీసర్లు చెప్తున్నారు. శుక్రవారం రాత్రి నుంచి ఫైర్‌సిబ్బంది 2 ఫైరింజన్లతో మంటలార్పుతుండగా శనివారం సాయంత్రం అదుపులోకి వచ్చాయి. జేసీబీలతో గోడౌన్గోడలు పగులగొట్టి ట్రాక్టర్ల ద్వారా బ్యాగులను బయటకు తీసి నష్ట తీవ్రతను తగ్గించారు. ప్రభుత్వ యంత్రాంగం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని స్థానికులు విమర్శిస్తున్నారు.
కాలి బూడిదైన 550 గట్టలు
యాసంగి సీజన్లో వడ్ల కొనుగోలు కోసం సివిల్ సప్లై శాఖ అధికారులు లింగంపేట మండలం ఎల్లారం శివారులోని మార్కెటింగ్‌శాఖకు చెందిన గోదాంను కిరాయికి తీసుకున్నారు. జనవరి నెలలో ప్రభుత్వం పంపించిన గన్నీ బ్యాగ్‌లను అందులో స్టోర్చేశారు. కామారెడ్డి జిల్లాకు సంబంధించి 26, 72,500 గన్నీ బ్యాగులు( 5,345 గట్టలు, ఒక్కో గట్టలో 500 బ్యాగులు) వచ్చాయి. అధికారుల లెక్కల ప్రకారం.. ఒక్కో సంచి విలువ రూ.80 ఉంటుంది. ఈ లెక్కన నిల్వ ఉంచిన మొత్తం బ్యాగుల విలువ రూ. 21.38 కోట్లు. శుక్రవారం సాయంత్రం గోదాంపై నుంచి పొగలు రావడాన్ని గమనించి స్థానికులు ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు. గోదాంకు సమీపంలోనే ఫారెస్ట్ఉండడంతో అక్కడ మంటలు చెలరేగి ఉంటాయని ముందుగా భావించారు. కానీ గోదాంలో అని తెలియడంతో వెంటనే ఎల్లారెడ్డి, కామారెడ్డి నుంచి 2 ఫైరింజన్లను రప్పించారు. రాత్రంతా మంటలార్పే ప్రయత్నం చేసినా.. పూర్తిగా అదుపులోకి రాలేదు. అగ్ని ప్రమాదంలో 550 గట్టలు కాలి బూడిదయ్యాయయి. 2.75 లక్షల గన్నీ బ్యాగులు కాలిపోయాయని, వీటి విలువ సుమారు రూ. 2.20 కోట్లు ఉంటుందని అధికారులు చెప్తున్నారు.
ప్రభుత్వం నిర్లక్ష్యం
భారీ మొత్తంలో గన్నీ బ్యాగులు తీసుకొచి గోదాంలో నిల్వ ఉంచినా అక్కడ ఎలాంటి సెక్యూరిటీని పెట్ట లేదు. గోదాం చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా సగమే ఉంది. దీనికి మెయిన్ గేట్ కూడా లేదు. గోదాం పరిసరాల్లో అప్పుడప్పుడు కొందరు వ్యక్తులు కూర్చొని మద్యం తాగుతారని స్థానికులు చెప్తున్నారు. గోదాం చుట్టూ చిన్నపాటి కిటీకీలు ఉండగా, ఓ కిటీకి జాలి పాడై రంధ్రం ఏర్పడింది. అక్కడి నుంచి ఆకతాయిలెవరైనా సిగరెట్తాగి పడేసి ఉండవచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బ్యాగుల తయారీ టైంలో కెమికల్స్ వినియోగిస్తారని, భారీ మొత్తంలో గట్టలు తీసుకొచ్చి నిల్వ ఉంచడంతో బ్యాగుల మధ్య రాపిడి వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు చెప్తున్నారు. అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే అగ్ని ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు.
గోడలు పగుల గొట్టి..
రాత్రంత ఫైరింజన్లతో మంటలార్పినప్పటికీ గట్టల మధ్యలో నుంచి శనివారం ఉదయం పొగ వ్యాపించింది. కాలిన గట్టల్ని బయటకు తీసుకువచ్చేందుకు 2 వైపులా గోడల్ని జేసీబీతో పగుల గొట్టారు. ట్రాక్టర్ల సాయంతో గట్టలు బయటకు తీసుకొచ్చి నీటిని స్ప్రే చేశారు. ఘటనా స్థలాన్ని సివిల్ సప్లై డీఎం అభిషేక్, జిల్లా ఫైర్‌ఆఫీసర్ గౌతమ్ పరిశీలించారు.
ఉన్నతాధికారులకు రిపోర్ట్ పంపాం
అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనేది ఇంకా తేలాల్సి ఉంది. ప్రమాదంపై ఉన్నతాధికారులకు రిపోర్టు పంపాం. గన్నీ బ్యాగ్‌ల తయారీ టైంలో కెమికల్స్ వాడుతారు. బ్యాగుల రాపిడితో ఏమైనా మంటలు చెలరేగాయా? అని అనుమానం వస్తోంది. గోదాం వద్ద సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని రిపోర్టులో కోరాం.
- అభిషేక్, డీఎం, సివిల్ సప్లై శాఖ