- 33/11 కె.వి. సబ్‌స్టేషన్‌లో భారీ ఎత్తున చేలరేగిన మంటలు
- రూ. కోటిన్నరకు పైగా నష్టం
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డు రాజీవ్ పార్కు పక్కన ఉన్న 33/11 కె.వి. సబ్‌స్టేషన్ మంగళవారం దగ్ధమైంది. భారీ ఎత్తున చేలరెగిన మంటలతో సబ్ స్టేషన్80 శాతంకు పైగా కాలిపోయింది. మంగళవారం మధ్యాహ్నం తర్వాత సబ్ స్టేషన్ లో ఆకస్మాత్తుగా మంటలు చేలరేగాయి. సబ్‌స్టేషన్‌లో 8 ఎంవీఎ పవర్ ట్రాన్స్ఫార్మర్లోని బూష్‌కు స్పార్క్ రావటంతో ట్రాన్స్ఫార్మర్ పేలింది. దీంతో పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌లో ఉన్న అయిల్‌కు మంటలు అంటుకున్నాయి. మంటలు భారీగా చెలరేగాయి. 8 ఎంవీఎ వపర్ ట్రాన్స్ఫార్మర్, 5 ఎంవీఎ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు, సర్క్యూట్ బ్రేకర్లు, ఇతర పరికరాలు కాలిపోయాయి. సబ్ స్టేషన్ పూర్తిగా దెబ్బతింది. రూ. కోటిన్నరకు పైగా ఆస్తినష్టం జరిగినట్లు అంచనా.
రెండు గంటలకు పైగా మంటలు చెలరేగాయి. మంటలు అంటుకున్న వెంటనే డ్యూటీలో ఉన్న ఆపరేటర్ ఫైర్‌స్టేషన్‌కు, ఎన్సీడీసీఎల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. కామారెడ్డి పైర్‌ఇంజన్ వచ్చి మంటలు అర్పే ప్రయత్నం చేసినప్పటికీ అదుపులోకి రాలేదు. రెండు పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌లో 6 నుంచి 8 వేల లీటర్ల వరకు అయిల్ ఉండటంతో మంటల తీవ్రత పెరిగింది. ఎల్లారెడ్డి నుంచి మరో ఫైర్ ఇంజన్‌కు రప్పించారు. 2 ఫైర్ ఇంజన్లతో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. వెంటనే ఇక్కడకు ఎన్పీడీసీఎల్ ఎస్ఈ శ్రావణ్ కుమార్, డీఈలు కల్యాణ చక్రవర్తి, నాగరాజు, ఇతర అధికారులు, ఏఈలు, సిబ్బంది వచ్చారు. ఈ సబ్‌స్టేషన్ పరిధిలోని కామారెడ్డిటౌన్‌లోని ఆయా ఏరియాలకు గంట సేపట్లో తిరిగి కరంట్ సప్లయ్ పునరుద్ధరించారు. కామారెడ్డి కలెక్టరేట్, హౌజింగ్‌బోర్డు, ఆరేపల్లి సబ్స్టేషన్ల నుంచి 4 ఫీడర్లకు సప్లయ్ అందించారు. కాలిపోయిన ఈ సబ్‌స్టేషన్ తిరిగి పునరుద్ధరించేందుకు వారం, పది రోజులు పట్టవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి.