మెహిదీపట్నం, వెలుగు: పాతబస్తీ కిషన్ బాగ్లో రెండు ట్రాన్స్ఫార్మర్లు పేలి భారీగా మంటలు చెలరేగాయి. జూ పార్కు క్వాటర్స్ సమీపంలో ఫుట్‌పాత్‌పై పక్కపక్కనే ఉన్న రెండు ట్రాన్స్ఫార్మర్లు శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు పేలాయి. దీంతో పక్కనే ఫుట్ పాత్‌ను ఆక్రమించి పెట్టిన సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్, రెండు తోపుడు బండ్లకు మంటలంటుకొని కాలిబూడిదయ్యాయి. ఆ సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. స్థానికుల సమాచారంతో బహదూర్ పుర ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని, 3 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పారు.
షార్ట్ సర్క్యూట్‌తో ఇంట్లో మంటలు
శామీర్ పేట: మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం మలక్ పేటలోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌తో టీవీతోపాటు పక్కనే ఉన్న బీరువాలోని బట్టలు కాలిపోయాయి. బట్టలతోపాటు కూలి డబ్బులు సైతం మంటల్లో కాలిపోయినట్లు బాధితుడు వీరాల మాణిక్యం తెలిపారు. ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని జీనోమ్ వ్యాలీ పోలీసులు పేర్కొన్నారు.
జీడిమెట్ల: పేట్‌బషీరాబాద్ పరిధిలోనూ శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. కొంపల్లి ఎన్సీఎల్కాలనీలో రోడ్డు పక్కన ఖాళీగా ఉన్న ప్రదేశంలో పాడైపోయిన డెకరేషన్ సామగ్రిని గుర్తుతెలియని వ్యక్తులు భారీగా డంప్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఆకతాయిలు ఈ సామగ్రికి నిప్పుపెట్టారు. దీంతో భారీగా మంటలు, దట్టమైన పొగలు వెలువడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని, మంటలను ఆర్పివేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.