![నల్లగొండ పట్టణంలోని లతీఫ్ సాహెబ్ గుట్టపై అగ్ని ప్రమాదం](https://static.v6velugu.com/uploads/2025/02/fire-accident-at-latif-saheb-gutta-in-nalgonda-town_CxbjZ964Lr.jpg)
నల్లగొండ పట్టణంలోని లతీఫ్ సాహెబ్ గుట్టపై అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం (ఫిబ్రవరి 14) రాత్రి సమయంలో గుట్టపై మంటలు చెలరేగడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెంటనే పోలీసులను అప్రమత్తం చేశారు. ఎస్పీ ఆదేశాలతో వన్ టౌన్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహటిన ఘటన స్థలానికి చేరుకుని ఫైరింజన్ల సహయంతో గుట్టపై మంటలను అదుపు చేశారు. గుట్టపై అగ్ని ప్రమాదం జరగడంతో భయాందోళనకు గురైన స్థానికులు.. ఎట్టకేలకు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో నిమ్మలపడ్డారు.
ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గుట్టపై అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదవశాత్తూ జరిగిందా..? లేదా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా..? లేదా ఆకతాయిల పనా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.