- హోటల్ బిల్డింగ్ పైనే ప్రైవేటు దవాఖాన
- పరుగులు తీసిన రోగులు, బంధువులు
- గర్భిణులను, బాలింతలను తీసుకువచ్చి రోడ్డుపై కూర్చోబెట్టిన యాజమాన్యం
ఎల్బీనగర్, వెలుగు: వనస్థలిపురం పిస్తాహౌస్ హోటల్‌లో శుక్రవారం ఉదయం మంటలు అంటు కుని పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది. పిస్తా హౌస్ ఉన్న బిల్డింగ్‌లోనే లైఫ్ స్ప్రింగ్ ప్రైవేట్ దవాఖాన ఉండడంతో హోటల్‌లోని సిబ్బంది, పేషెంట్స్, వారి బంధువులు బయటకు పరుగులు తీశారు. దవాఖాన యాజమాన్యం పేషెంట్స్‌ను బయటకు తీసుకురావడంతో ప్రమాదం తప్పింది. పేషెంట్లు గర్భిణులు, బాలింతలు కిందకు దిగడానికి ఇబ్బందులు పడ్డారు.
అందరినీ రోడ్డు మీద కుర్చీల్లో కుర్చోబెట్టి వేరే దవాఖానకు తరలించాల్సి వచ్చింది. కింద ఫ్లోర్ లోనే పిస్తా హౌస్ కిచెన్ ఉండటంతో ఫైర్ సేఫ్టీ అధికారులు ఆక్సిజన్ మాస్కులతో లోపలికి వెళ్లి మంటలను అదుపు చేయగలిగారు. ఈ హోటల్, దవాఖానలో పేరుకే ఫైర్ సేఫ్టీ పరికరాలున్నా అవి పని చేయడం లేదని అధికారులు తెలిపారు. ఇది మూడంతస్తుల పాత బిల్డింగ్ కావడంతో పట్టించుకునేవారు కరువయ్యారు. దీంతో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఒకే బిల్డింగ్ లో హోటల్, దవాఖాన నిర్వహణకు అనుమతులు ఇవ్వొద్దని రూల్స్ ఉండగా.. పిస్తా హౌస్, దవాఖానకు పర్మిషన్ ఇవ్వడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హోటల్, దవాఖాన మేనేజ్మెంట్పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.