సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‎లో మంటలు: ప్లేట్లు వదిలేసి పరుగులు తీసిన కస్టమర్లు

వెలుగు, హైదరాబాద్: నిత్యం కస్టమర్లతో రద్దీగా ఉండే సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‎లో అగ్ని ప్రమాదం జరిగింది.  ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో హోటల్ సిబ్బందితో పాటు కస్టమర్లు తీవ్ర భయాందోళనకు గురై తినే ప్లేట్లను వదిలి బయటకు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన హోటల్ స్టాఫ్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి  తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణ హాని జరగలేదు. ఎవరూ గాయపడలేదు. హోటల్లో పని చేసే ఓ యువకుడు స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో హాస్పటల్‎కు తరలించారు. 

కిచెన్ నుంచి భారీ ఎత్తున మంటలు రావటం చూసిన పని వారు, కస్టమర్లు వెంటనే అప్రమత్తం అయ్యి.. బయటకు పరుగులు తీశారు. సిబ్బంది సైతం సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయటంతో పెను ప్రమాదం తప్పింది.హోటల్ కింద ఉన్న సెల్లార్‎లో జనరేటర్ ఓవర్ హిట్ వల్లనే మంటలు వ్యాపించినట్లు ఫైర్ ఆఫీసర్ ప్రాథమికంగా నిర్ధారించారు. కస్టమర్లకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో హోటల్ సిబ్బందితో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ALSO READ | హైడ్రాకు జనం మద్దతు