- రికార్డు రూంలో ఫైళ్లు, కంప్యూటర్లు దగ్ధం
భద్రాచలం, వెలుగు : భద్రాచలం పాత ఎంపీడీవో ఆఫీసులో గురువారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగి రికార్డు రూం దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న వెంటనే ఫైర్‌సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేశారు. అప్పటికే రికార్డు రూంలోని ఫైళ్లు, కంప్యూటర్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.
ఎంపీడీవో ఆఫీసును ఆళ్లపల్లి మండలానికి మార్చాక స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఇక్కడ కార్యకలాపాలు జరుగుతున్నాయి. దళితబంధు, బీసీ బంధు, పెన్షన్లు ఇతర స్కీంలను జడ్పీ డిప్యూటీ సీఈవో నాగలక్ష్మీ స్పెషల్ ఆఫీసర్‌గా పర్యవేక్షిస్తున్నారు. ఆ రికార్డులు మొత్తం ఇందులోనే ఉన్నాయి. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే సీఐ నాగరాజురెడ్డి, ఫైర్‌ఆఫీసర్ శ్రీనివాసరావు, స్పెషల్ ఆఫీసర్ నాగలక్ష్మి పాత ఎంపీడీవో ఆఫీసుకు వచ్చారు. ప్రమాద వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.