జమ్మూ కాశ్మీర్‎లో ఘోర అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి.. నలుగురికి సీరియస్

జమ్మూ కాశ్మీర్‎లో ఘోర అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి.. నలుగురికి సీరియస్

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‎లోని కథువా జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం అర్థరాత్రి సమయంలో శివనగర్‎లోని ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న ఆరుగురు మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

అర్థరాత్రి సమయంలో ఓ ఇంట్లో మంటలు చెలరేగడం గమనించిన స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్నామని పోలీసులు తెలిపారు. ఇంట్లోకి వెళ్లి చూడగా ఆరుగురు మృతి చెంది ఉన్నారు.. మరో నలుగురు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించామన్నారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలిపారు. 

మృతులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో మరణాలు సంభవించాయని చెప్పారు.  పొగ పీల్చడంతో ఊపిరాడక బాధితులు చనిపోయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, కాలిన గాయాలు ఏవీ లేవని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తోన్నట్లు పోలీసులు తెలిపారు. అగి ప్రమాదానికి గల కారణాలు ఏంటనే దానిపై ఆరా తీస్తున్నామన్నారు.