ఖమ్మం: రైతుల పండుగ కనుమ వేళ ఖమ్మం పత్తి మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 2025, జనవరి 15వ తేదీ రాత్రి సమయంలో మార్కెట్ యార్డ్ షెడ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు క్షణాల్లో వ్యాపించడంతో షెడ్లో నిల్వచేసిన పత్తి బస్తాలు తగలబడ్డాయి. మంటలు ఉవ్వెత్తున ఎగసిపడటంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని ఫైరింజన్ల సహయంతో మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. ఈ ఘటనలో దాదాపు మార్కెట్ గోడౌన్లో నిల్వ ఉంచిన 400 పత్తి బస్తాలు మంటల్లో దగ్ధం అయినట్లు సమాచారం. ఖరీదు చేసిన పత్తి మంటల్లో కాలి పోవడంతో పత్తి వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ | తిరుపతిలో మంచు మనోజ్ లొల్లి : యూనివర్సిటీ దగ్గర పోలీసుల లాఠీఛార్జ్
సమాచారాం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి.. అగ్ని ప్రమాదానికి గల కారణం ఏంటన్న దానిపై ఆరా తీస్తున్నారు. అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆస్తి నష్టం ఎంత జరిగిందనేది తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాదం జరగడంతో మార్కెట్కు వచ్చిన రైతులు భయాందోళనకు గురి అయ్యారు.