
పెబ్బేరు, వెలుగు: వనపర్తి జిల్లా పెబ్బేరులో బుధవారం అర్ధరాత్రి రెండు చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగాయి. పట్టణంలోని సబిత క్లినిక్‌లోని మెడికల్షాపులో రాత్రి 11 గంటల సమయంలో మంటలు చెలరేగి క్లినిక్వెనుక ఉన్న ఇండ్ల వరకు వ్యాపించడంతో కాలనీవాసులు షాపు యజమానులకు సమాచారమిచ్చారు. వారు వెంటనే అక్కడికి చేరుకొని విద్యుత్, ఫైర్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫైర్ఇంజిన్వచ్చేసరికే ఫార్మసీ మొత్తం కాలిపోయింది. ప్రమాద ఘటనను పెబ్బేరు ఎస్సై హరిప్రసాద్‌రెడ్డి పరిశీలించారు.
దాదాపు రూ. 15 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేశారు. అయితే ఈ ప్రమాదంపై అనుమానాలున్నాయని యజమానులు ఆంజనేయులు, రవి తెలిపారు. పట్టణంలోని సంత బజారులో ఉంటూ పండ్ల వ్యాపారం చేసుకునే వడ్ల బాలస్వామి ఇంట్లోని కూలర్నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగి ప్రమాదం జరిగింది. మంటలంటుకొని ఇంట్లో ఉన్న రూ.90వేల నగదు కాలిపోయింది. మొత్తంగా రూ.2 లక్షల మేర ఆస్తినష్టం జరిగిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆర్థికంగా తమను ఆదుకోవాలని కోరారు.