స్క్రాప్ దుకాణంలో మంటలు

గండిపేట, వెలుగు: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ స్క్రాప్​దుకాణంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓల్డ్​ సిటీకి చెందిన ఒవైజ్ అనే వ్యక్తి శివరాంపల్లి ప్రాంతంలో స్క్రాప్ దుకాణం నిర్వహిస్తున్నాడు. పాడైపోయిన బస్సులు, కార్లు, ఆటోలు, బైక్​లు ఇతర వెహికల్స్​ను తీసుకొచ్చి స్క్రాప్ చేసి అమ్ముతుంటాడు. గురువారం మధ్యాహ్నం ఓ బస్సును సిబ్బంది వెల్డింగ్ తో వేరు చేస్తుండగా ప్రమాదవశాత్తూ నిప్పంటుకుని, నిమిషాల వ్యవధిలో మంటలు వ్యాపించాయి. దీంతో సిబ్బంది బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కేసు నమోదు చేసుకున్న రాజేంద్రనగర్  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆందోళనకు  గురైన స్థానికులు

దట్టమైన పొగలతో శివరాంపల్లి పరిసర ప్రాంతాలకు చెందిన జనాలు భయపడిపోయారు. ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రమాదం జరిగిన ప్రాంతంలోని అపార్ట్​మెంట్ వాసులు, అక్కడి బస్తీలోని జనాలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు