పిస్తా హౌస్‏లో అగ్నిప్రమాదం.. భయంతో పరుగులు పెట్టిన కస్టమర్స్

హైదరాబాద్: వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని పిస్తా హౌస్‏లో అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం పిస్తా హౌజ్ కిచెన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే, అగ్ని ప్రమాద సంభవించిన పిస్తా హౌజ్ కిందనే ఓ ప్రయివేట్ ఆస్పత్రి ఉంది. ఫైర్ యాక్సిడెంట్ కారణంగా పిస్తా హౌజ్ నుండి మంటలు, దట్టమైన పొగలు రావడంతో తీవ్ర భయాందోళనకు గురైన పేషేంట్లు, వారి బంధువులు తీవ్ర పరుగులు తీశారు. 

వెంటనే అప్రమత్తమైన హోటల్ సిబ్బంది, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సహయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు, హోటల్ సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.