మహీంద్రా కారు షోరూమ్ లో భారీ అగ్నిప్రమాదం

మహీంద్రా కారు షోరూమ్ లో భారీ అగ్నిప్రమాదం
  •  కాలి బూడిదైన 15 కార్లు..  వీటిలో ఈవీలు కూడా  మాదాపూర్ కొత్తగూడ చౌరస్తాలో ఘటన

మాదాపూర్, వెలుగు: మాదాపూర్ కొత్తగూడ చౌరస్తాలోని మహీంద్రా కారు షోరూమ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం రాత్రి 10 గంటల సమయంలో షోరూమ్ నేమ్ బోర్డులో నుంచి మంటలు చెలరేగి, క్షణాల వ్యవధిలోనే షోరూమ్ మొత్తం అంటుకున్నాయి.  భారీగా మంటలు ఎగసిపడడంతో సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఫైర్, పోలీసులకు సమాచారం అందించారు.

 నాలుగు ఫైర్ ఇంజిన్లతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది అర్ధరాత్రి వరకు శ్రమించి మంటలను ఆర్పివేశారు. అప్పటికే ఈ మంటల్లో 15 కార్లు కాలిపోయినట్లు తెలుస్తున్నది. వీటిలో కొన్ని ఈవీలు కూడా ఉన్నట్టు సమాచారం. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. 

మంటల తీవ్రతతో పక్కనే ఉన్న ఓయో హోటల్ ను పోలీసులు ఖాళీ చేయించారు. ప్రమాద కారణంగా  కొండాపూర్ గచ్చిబౌలి ప్రధాన రోడ్డు భారీగా ట్రాఫిక్‌‌ జామ్‌‌ అయ్యింది.

 ఎలక్ట్రికల్ షాప్ లో ప్రమాదం

మేడ్చల్: మేడ్చల్ లోని పోలిక్యాబ్ శానిటేషన్ ఎలక్ట్రికల్ షాప్ లో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా షాపులోని వస్తువులన్నీ ఖాళీ బూడిదయ్యాయి. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని ఒక ఫైర్ ఇంజిన్, రెండు ట్యాంకర్లతో మంటలను ఆర్పివేశారు. షాప్ షెటర్ కట్ చేసి ఉండడంతో ప్రమాదంపై అనుమానం వ్యక్తమవుతోంది. దీంతో షాపు నిర్వాహకుడి  ఫిర్యాదుతో మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.