
పెంబి, వెలుగు: పెంబి మండలంలోని రాయదారి గ్రామంలో గురువారం మధ్యాహ్నం షార్ట్ సర్క్యూట్ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదు ఇండ్లు, ఐదు కొట్టాలు పూర్తిగా కాలిపోయాయి. జాదవ్ బిక్కు ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అయిందని దాంతో పక్కనే ఉన్న ఇండ్లకు మంటలంటుకుని పూర్తిగా కాలిపోయాయని గ్రామస్తులు తెలిపారు. రెండు ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. బాధితుల ఇళ్లలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
బిక్కు జాదవ్, కిమ్యా జాదవ్, నరేశ్ రాథోడ్, పాండ్య రాథోడ్, రాజేష్ బాణావత్, రావణ్ బాణావత్, చౌహన్ బాణావత్, వినేష్ జాదవ్, రవి జాదవ్ ఇండ్లు, కొట్టాలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. తహసీల్దార్ లక్ష్మణ్,ఎంపీడీఓ రమాకాంత్, ఎస్ఐ హన్మాండ్లు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. తమ ఇండ్లు పూర్తిగా దగ్ధం అవ్వడంతో బాధితులు తమను ప్రభుత్వం అన్ని విధాలా ఆడుకోవాలని కోరారు.
అగ్ని ప్రమాద బాధితులను ఆదుకుంటాం
ఖానాపూర్ / పెంబి, వెలుగు: పెంబి మండలం రాయదారి గ్రామంలో గురువారం జరిగిన షార్ట్ సర్య్కూట్ కారణంగా నష్టపోయిన బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.