కుంభ మేళాలో మళ్లీ మంటలు.. సెక్టార్ 18లోని ఇస్కాన్ క్యాంప్​లో ఘటన

కుంభ మేళాలో మళ్లీ మంటలు.. సెక్టార్ 18లోని ఇస్కాన్ క్యాంప్​లో ఘటన
  • 20కి పైగా గుడారాలు బుగ్గి.. తప్పిన ప్రాణ నష్టం
  •     ఇప్పటి వరకు 40 కోట్లకు పైగా భక్తుల పుణ్య స్నానాలు
  •     త్రివేణి సంగమానికి బిహార్ గవర్నర్, గుజరాత్ సీఎం

మహాకుంభనగర్ (యూపీ): ప్రయాగ్​రాజ్​లో జరుగుతున్న మహా కుంభ మేళాలో శుక్రవారం మరోసారి అగ్నిప్రమాదం జరిగింది. శంకరాచార్య మార్గ్‌‌లోని సెక్టార్‌‌ 18లో ఉన్న ఇస్కాన్ క్యాంప్​లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. వెంటనే స్పందించిన ఫైర్ సేఫ్టీ అధికారులు.. మంటలు ఆర్పేశారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని చెప్పారు. 

ఇస్కాన్ క్యాంప్ పక్కనే అఖాడాల గుడారాలు ఉండటంతో వాటిని ఖాళీ చేయించారు. మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 20 టెంట్లు కాలి బూడిదైనట్లు ఫైర్ సేఫ్టీ అధికారులు ప్రకటించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, విచారణ జరుగుతోందని చెప్పారు. కాగా, కుంభమేళా మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా నాలుగు సార్లు అగ్ని ప్రమాదాలు సంభవించాయి.

మరో రెండు ముహూర్తాలు.. 

మహా కుంభమేళాకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 40 కోట్లకు పైగా భక్తులు పుణ్య స్నానం ఆచరించినట్లు నిర్వాహకులు తెలిపారు. శుక్రవారం ఒక్కరోజే 50 లక్షలకు పైగా భక్తులు పుణ్య స్నానం చేశారు. ఫిబ్రవరి 26 వరకు మేళా జరగనుంది. మకర సంక్రాంతి రోజు 3.5 కోట్ల మంది, వసంత పంచమి రోజు 2.60 కోట్ల మంది, పుష్య పౌర్ణమి సందర్భంగా జనవరి 30న, ఫిబ్రవరి 1న 1.70 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారు.

 ఇంకా రెండు ముహుర్తాలు మిగిలి ఉన్నాయి. ఈ నెల 12న మాఘ పౌర్ణమి, 26న మహా శివరాత్రి రోజున పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశాలున్నాయి. కాగా, పుణ్య స్నానమాచరించి ఇంటికి వెళ్తున్న ఇద్దరు భక్తులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. 15 మంది వరకు గాయపడ్డారు. యమునా ఎక్స్​ప్రెస్ హైవేపై ఆగి ఉన్న బస్సును.. భక్తులు ప్రయాణిస్తున్న మినీ బస్ ఢీకొట్టడంతో యాక్సిడెంట్ జరిగింది. మృతులను హర్యానాకు చెందిన పవన్ (53), మహేంద్ర (73)గా గుర్తించారు. 

బిహార్ గవర్నర్, గుజరాత్ సీఎం పుణ్య స్నానాలు

బిహార్ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ శుక్రవారం త్రివేణి సంగమంలో పుణ్యస్నానమాచరించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తెలిపారు. మానవుడు అనేవాడు.. మాధవుడి (శ్రీకృష్ణుడు) ప్రతిరూపమని అన్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానమాచరించడంతో ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ మహా కుంభమేళాకు రావాలని పిలుపునిచ్చారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కూడా పుణ్య స్నానమాచరించారు. మహా కుంభమేళాలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇండియన్ కల్చర్​ను గౌరవించే ప్రతి ఒక్కరూ త్రివేణి సంగమంలో పుణ్య స్నానమాచరించాలని కోరారు.