షార్ట్ సర్క్యూట్​తో బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్​లో మంటలు

బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో గురువారం స్పెషల్  వార్డులోని ఓ రూమ్ లో షార్ట్ సర్క్యూట్ తో ఏసీలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఏసీతో పాటు సీలింగ్  పూర్తిగా కాలిపోయింది. గమనించిన వైద్య సిబ్బంది ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. ఫైర్  సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

సకాలంలో మంటలు అదుపు చేయకపోతే మరిన్ని గదులకు మంటలు వ్యాపించి మరింత నష్టం జరిగి ఉండేదని సిబ్బంది పేర్కొన్నారు. ఈ ఘటనతో రూ. లక్ష నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న బెల్లంపల్లి ఏరియా జీఎం శ్రీనివాస్, డీవై సీఎంవో మధుకుమార్  పరిశీలించారు. పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు జీఎం తెలిపారు.