యాదాద్రి థర్మల్‌‌ ప్లాంట్లో అగ్ని ప్రమాదం.. నిలిచిన 600 మెగావాట్ల విద్యుత్‌‌ ఉత్పత్తి

యాదాద్రి థర్మల్‌‌ ప్లాంట్లో అగ్ని ప్రమాదం.. నిలిచిన 600 మెగావాట్ల విద్యుత్‌‌ ఉత్పత్తి

నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి పవర్‌‌ ప్లాంట్‌‌లో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. థర్మల్‌‌ ప్లాంట్‌‌లో మొత్తం ఐదు యూనిట్లు నిర్మిస్తుండగా గతేడాది డిసెంబర్‌‌లోనే 2, 3 యూనిట్లను ప్రారంభించారు. మిగిలిన మూడు యూనిట్లను కూడా ప్రారంభించేందుకు ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా వచ్చే నెలలో యూనిట్‌‌ 1ను ప్రారంభించాలన్న ఉద్దేశంతో ఆఫీసర్లు ట్రయల్‌‌ రన్‌‌ చేస్తున్నారు.

ఈ క్రమంలో యూనిట్ 1 బాయిలర్‌‌కు ఆయిల్‌‌ సప్లై చేసే పైప్‌‌కు లీకేజీ ఏర్పడింది. అదే సమయంలో కింద వెల్డింగ్ పనులు జరుగుతుండడంతో నిప్పురవ్వలు ఆయిల్‌‌పై పడి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా యూనిట్‌‌ మొత్తానికి వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం కారణంగా 600 మెగావాట్ల విద్యుత్‌‌ ఉత్పత్తి నిలిచిపోయింది.

ప్రమాదంలో ఆస్తి, ప్రాణనష్టం జరగకపోవడంతో ప్లాంట్ ఆఫీసర్లు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ట్రయల్‌‌ రన్‌‌ సమయంలో ప్రమాదాలు సహజమే ప్లాంట్‌‌ ఆఫీసర్లు చెబుతున్నారు. ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలుసుకునేందుకు ఆఫీసర్లు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం ఎలా జరిగింది ? ఇందుకు గల కారణాలపై విచారణ జరిపి.. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకునేందుకు ఆఫీసర్లు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ప్రమాదంపై ఎమ్మెల్యే ఆరా
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌‌లో ప్రమాద విషయం తెలుసుకున్న మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి- ప్లాంట్‌‌ను పరిశీలించి, ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. యూనిట్‌‌ 1లోని బాయిలర్‌‌ వద్ద గ్యాస్‌‌ కట్‌‌ ఒత్తిడికి గురై ఆయిల్‌‌ లీక్‌‌ కావడం వల్లే మంటలు చెలరేగినట్లు ఆఫీసర్లు వెల్లడించారు. మిగిలిన మూడు బాయిలర్లు రన్‌‌ చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదని వివరించారు. బాయిలర్‌‌ గ్యాస్‌‌ కట్‌‌ను త్వరగా రిపేర్‌‌ చేయాలని ఎమ్మెల్యే ఆఫీసర్లను ఆదేశించారు. 24 గంటల్లోపు రిపేర్లు పూర్తి చేసి తిరిగి రన్నింగ్‌‌లోకి తీసుకువస్తామని ఆఫీసర్లు చెప్పారు.