గృహప్రవేశం చేసిన రోజే ఇల్లు దగ్ధం

  • రూ.25లక్షల ఆస్తి నష్టం.. మణికొండలో ఘటన 

గండిపేట, వెలుగు: గృహప్రవేశం చేసిన కొన్ని గంటల్లోనే పూజగదిలో పెట్టిన దీపం అంటుకుని ఇల్లు దగ్ధమైంది. ఈ ఘటన మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని ఈఐపీఎల్‌ అపార్ట్‌మెంట్‌ 9వ అంతస్తులో జరిగింది. ఐటీ ఉద్యోగి అయిన సంతోశ్ కొత్తగా 9వ అంతస్తులో ప్లాట్​కొన్నాడు. మంగళవారం బంధువులు, కుటుంబ సభ్యులతో కలిసి గృహప్రవేశం చేశాడు. ఈ సందర్భంగా పూజ గదిలో నూనె దీపం పెట్టారు. అయితే అర్ధరాత్రి టైంలో దీపం కింద ఉన్న బట్ట అంటుకుని మంటలు చెలరేగాయి.

పక్కనే ఉన్న కాటన్‌కు, డోర్, కిటికీల కర్టన్లకు, ఫర్నిచర్​కు, ఫ్లోర్​సిలింగ్‌కు వ్యాపించాయి. సంతోశ్​తోపాటు కుటుంబ సభ్యులు గమనించి పెద్దగా కేకలు వేశారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే ఇంట్లోని సామాగ్రి మొత్తం కాలిబూడిదైంది. దాదాపు రూ.25 లక్షల ఆస్తినష్టం జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు.