మెండోరా మండలంలో భారీ అగ్నిప్రమాదం

మెండోరా మండలంలో భారీ అగ్నిప్రమాదం

బాల్కొండ,వెలుగు : నిజామాబాద్ జిల్లా మెండోరా మండల కేంద్రంలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది.  ప్రమాదంలో గొల్ల చిన్నమల్లు ఇంటితో పాటు మరో మూడు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. చిన్నమల్లు ఇంటిలోని ఫ్రిడ్జి షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఇంటిలో మంటలు వ్యాపించి  పక్కనే ఉన్న గుండేటి శ్రీనివాస్ ఇంట్లో కిరాయి ఉంటున్న సూదుల ముత్తెశ్, వేల్పుల మహేందర్, తక్కల మస్కట్, సాయన్న ఇళ్లకు మంటలు అంటుకున్నాయి.  పురాతనమైన ఇల్లు కావడంతో చుట్టూ ఉన్న ఇళ్లు  కాలిబూడిదయ్యాయి. 

మంటలు చెలరేగడంతో స్థానికులు బాల్కొండ ఫైర్ స్టేషన్​కు సమాచారం ఇచ్చారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంటిలోని కలప కారణంగా మంటలు ఆర్పేందుకు ఎంత శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. ఫైర్ ఇంజన్ లో నీళ్లు అయిపోవడంతో స్థానికులు మరో వాటర్ ట్యాంకర్ ను సమకూర్చారు. ప్రమాదంలో  నిత్యావసర వస్తువులు,బంగారం, నగదు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. 

సుమారు రూ.20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు. ప్రమాద సమయంలో ఇళ్లల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. నిరాశ్రయులైన నాలుగు కుటుంబాలు రోడ్డున పడ్డాయి.  ప్రమాదంలో సర్వం కోల్పోయి బోరున విలపిస్తున్నారు. రోడ్డునపడ్డ తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.