- ఫైరింజన్లు చేరుకునేందుకు సరైన మార్గం లేక అవస్థలు
- ఓపెన్ ఏరియాలో గార్డెన్ ఏర్పాటే కారణం
గండిపేట, వెలుగు: హైదరాబాద్ మణికొండలోని పుప్పాలగూడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ అపార్ట్మెంట్లోని ఫ్లాట్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, మంటలు అదుపులోకి తెచ్చారు. పుప్పాలగూడలోని గోల్డెన్ ఓరియోల్ అపార్ట్మెంట్స్ బ్లాక్ బీలోని 310 ఫ్లాట్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగి వెంకట రమణారెడ్డి తన ఫ్యామిలీతో ఉంటున్నాడు. శనివారం తెల్లవారుజామున 4.30 గంటలకు వీరి ఫ్లాట్‌లో మంటలు చెలరేగి ఇల్లంతా వ్యాపించాయి. అదేసమయంలో ఇంట్లోని గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాద తీవ్రత పెరిగింది.
వెంటనే వెంకటరమణారెడ్డి నలుగురు కుటుంబ సభ్యులు భయంతో బయటకు పరుగులు తీశారు. స్థానికులు ఫైర్ స్టేషన్‌కు కాల్ చేసి సమాచారం ఇవ్వగా, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. సుమారు రూ.50 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే, అపార్ట్మెంట్లో ఓపెన్‌గా ఉంచాల్సిన ఏరియాలో గార్డెనింగ్‌తో పాటు మెట్లు నిర్మించారు. దీంతో ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకునేందుకు చాలా సమయం పట్టింది. ఘటనా స్థలాన్ని అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. బాధితుడు వెంకటరమణారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.