సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్లో మంటలు

సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్ సెల్లార్​లో శుక్రవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. హోటల్ సిబ్బందితో పాటు కస్టమర్లు తీవ్ర భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. పక్కనే ఫైర్ స్టేషన్​ఉండడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. 

ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ హాని జరగలేదు. అయితే, ఒక్క సారిగా దట్టమైన పొగలు వెలువడడంతో హోటల్లో పని చేసే ఓ యువకుడు  అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని సమీపంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ కు తరలించారు. సెల్లార్​లోని జనరేటర్ ఓవర్ హీటై మంటలు వ్యాపించినట్లు ఫైర్ ఆఫీసర్  తెలిపారు.