
- పత్తి జిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం
- ఎయిర్ కంప్రెషన్ లో షార్ట్ సర్క్యూట్
- కాలిపోయిన రూ.60 లక్షల కాటన్
ములుగు, వెలుగు : పత్తి జిన్నింగ్ మిల్లులో మెషీన్ల రాపిడితో ఎయిర్ కంప్రెషన్ లో షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్నిప్రమాదం జరిగింది. ములుగు మండలం జాకారం సమీపంలోని రాజరాజేశ్వర పత్తి జిన్నింగ్ మిల్లులో గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో రూ.60 లక్షల పత్తి కాలిపోయింది. యాజమానులు రవీందర్, సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. జాకారం సమీపంలో రవితోపాటు మరికొందరు పార్టనర్స్ కలిసి రాజరాజేశ్వర పత్తి జిన్నింగ్ మిల్లు నిర్వహిస్తున్నారు. సీజన్ కావడంతో సుమారు రూ.2 కోట్ల విలువైన పత్తిని సేకరించారు.
మిల్లు రన్ అవుతుండగా యంత్రాల్లో రాపిడి కారణంగా ఎయిర్ కంప్రెషన్ లో మంటలు చెలరేగాయి. మంటలు పత్తిని అంటుకున్నాయి. అప్రమత్తమైన కార్మికులు యజమానులకు సమాచారం ఇవ్వడంతో పవర్ ఆఫ్ చేసి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ములుగు, పరకాల, నర్సంపేటకు చెందిన మూడు ఫైరింజన్లు సకాలంలో వచ్చి మంటలు ఆర్పివేశాయి. అప్పటికే రూ.60 లక్షల మేర పత్తి దగ్ధమైందని యజమానులు వెల్లడించారు. అప్రమత్తం కావడంతో సుమారు రూ.కోటి 40 లక్షల పత్తిని కాపాడుకోగలిగామని వారు పేర్కొన్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.