BBL 2025: బిగ్ బాష్ లీగ్‌లో అగ్ని ప్రమాదం.. అభిమానులను తరలించిన పోలీసులు

బిగ్ బాష్ లీగ్‌లో ఊహించని సంఘటన ఒకటి  ప్రేక్షకులను కంగారెత్తించింది. గురువారం (జనవరి 16) బ్రిస్బేన్ హీట్, హోబర్ట్ హరికేన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హోబర్ట్ హరికేన్స్ లక్ష్యాన్ని ఛేదిస్తుండగా ఈ సంఘటన అందరినీ భయానికి గురి చేసింది. బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో డీజే బూత్‌లో స్వల్ప మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పడానికి అగ్నిమాపక యంత్రంతో ఒక వ్యక్తి కనిపించాడు. స్టీవార్డ్‌లు సమీపంలోని స్టాండ్‌ల నుండి ఖాళీ చేయమని ఆదేశించారు. 

గందరగోళ పరిస్థితుల మధ్య అక్కడ ఉన్న పోలీసు అధికారులు త్వరగా అభిమానులను తరలించారు. స్కోర్‌బోర్డ్ క్రింద ఉన్న మూడో స్టేర్ దగ్గర ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. గ్రౌండ్ స్టాఫ్ వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకుని మంటలు వ్యాపించకుండా అడ్డుకున్నారు. స్టాండ్స్‌లో మంటలు చెలరేగడంతో మ్యాచ్ కు 20 నిమిషాల పాటు అంతరాయం కలిగింది. మంటలు అదుపులోకి రావడంతో ఆట మళ్లీ ప్రారంభించబడింది.

ALSO READ | Champions Trophy 2025: రూ. 315తో మ్యాచ్ చూడొచ్చు: ఛాంపియన్స్ ట్రోఫీకి టికెట్ ధరలు ఇవే

ఈ మ్యాచ్ విషయానికి వస్తే బ్రిస్బేన్ హీట్ పై హోబర్ట్ హరికేన్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన  
బ్రిస్బేన్ హీట్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. మార్నస్ లాబుస్చాగ్నే 44 బంతుల్లో 8 ఫోర్లు. 2 సిక్సర్లతో 77 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. లక్ష్య ఛేదనలో హోబర్ట్ హరికేన్స్ చివరి బంతికి విజయం సాధించింది. చివరి బంతికి ఒక పరుగు కావాల్సిన దశలో వెడ్ సిక్సర్ కొట్టి మ్యాచ్ ను గెలిపించాడు. కాలేబ్ జ్యువెల్ 76 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.