షార్ట్​సర్య్యూట్​తో ఇల్లు దగ్ధం​.. కాలిపోయిన వడ్లు ..బూడిదైన 10 తులాల బంగారం

  • జగిత్యాల జిల్లా రాజేశ్వర్​రావుపేటలో షార్ట్​సర్య్యూట్​తో ఇల్లు దగ్ధం​ 
  • రోడ్డున పడ్డ రైతు కుటుంబం 

మెట్ పల్లి, వెలుగు : షార్ట్ సర్క్యూట్​తో ఇల్లు దగ్ధం కావడంతో వడ్లు అమ్మితే వచ్చిన డబ్బులు రూ.4 లక్షలు, బీరువాలో దాచుకున్న 10 తులాల బంగారు ఆభరణాలతో పాటు సామాన్లన్నీ కాలి బూడిదయ్యాయి. మెట్ పల్లి మండలం రాజేశ్వరరావుపేటకు చెందిన గడ్డం చిన్నోల్ల పెద్ద సాయన్న రైతు. రోజు మాదిరిగానే ఆదివారం ఉదయం వ్యవసాయ పనుల కోసం భార్య, కూతుళ్లతో  కలిసి పొలానికి వెళ్లాడు. సుమారు పది గంటల సమయంలో సాయన్న ఇంటికి నిప్పంటుకుంది.

గమనించిన చుట్టుపక్కల వారు సాయన్నకు సమాచారమిచ్చారు. ఫైర్ సిబ్బందికి చెప్పగా వారు వచ్చి మంటలార్పారు. అయితే, అప్పటికే ఇల్లంతా కాలిపోయింది. పొలం నుంచి సాయన్న కుటుంబం పరిగెత్తుకు వచ్చినా ఏమీ దక్కించుకోలేకపోయింది. సాయన్న మాట్లాడుతూ ఇటీవల వడ్లు అమ్మిన డబ్బులు రూ.4 లక్షలు  బీరువాలో పెట్టానని, తన భార్యకు చెందిన నాలుగు తులాల బంగారు ఆభరణాలు, బిడ్డకు చెందిన నాలుగు తులాలు, తల్లికి చెందిన రెండు తులాలు బీరువాలో పెట్టామని, అవి కూడా కాలి బూడిదయ్యాయని రోదించాడు.

ఇటీవల తన బిడ్డ విడాకులు తీసుకోగా, ఆమె సామాన్లు, బంగారం కూడా ఇంట్లో పెట్టామని అవి కూడా దక్కలేదని కన్నీరు పెట్టుకున్నాడు. అన్నీ పోగొట్టుకుని రోడ్డున పడ్డామని, ప్రభుత్వం సాయం చేసి ఆదుకోవాలని వేడుకున్నాడు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ బాధితులకు రూ. 10 వేల సాయం చేశారు. ప్రభుత్వం నుంచి ఎక్స్ గ్రేషియా వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఆర్ఐ ఉమేశ్​ పంచనామా చేశారు.