తాండూరు పట్టణంలో సోఫా రిపేర్ దుకాణంలో అగ్ని ప్రమాదం

తాండూరు పట్టణంలో సోఫా రిపేర్ దుకాణంలో అగ్ని ప్రమాదం

వికారాబాద్​, వెలుగు:  తాండూరు పట్టణంలో మంగళవారం సోఫా రిపేర్లు చేసే దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. శివాజీ చౌక్ నుంచి మల్ రెడ్డిపల్లి వెళ్లే దార్లో మహమ్మద్ అబ్దుల్ రెహమాన్   సోనియా రెగ్జీన్, సోఫా ఫర్నీచర్ రిపేరు దుకాణం నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం వేళ షాపులో అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. చూస్తుండగానే మంటలు షాపు మొత్తం వ్యాపించాయి. దాదాపు 15 నిమిషాల పాటు మంటలు చెలరేగాయి.

 విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ప్రమాదం జరిగిన దుకాణానికి ఆనుకునే ప్రైవేట్​ స్కూల్​ ఉండడంతో మంటలు చూసి పిల్లలు ఒక్కసారిగా ఏడ్వడం మొదలుపెట్టారు. దీంతో టీచర్లు, సిబ్బంది, స్థానికులు కలిసి వారిని బయటకు తీసుకువెళ్లారు.   అగ్ని ప్రమాదంతో యజమానికి  రూ. 2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు తెలిసింది.