మక్తల్, వెలుగు: ప్రమాదశాత్తు నిప్పంటుకొని మండలంలోని గుర్లపల్లి గ్రామంలో శనివారం అగ్నిప్రమాదం జరిగి రెండు గుడిసెలు పూర్తిగా కాలిపోయాయి. రెండు గుడిసెలకు తాళం వేసి ఉండడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. రూ. 5 లక్షల నగదు, అర తులం బంగారం, 80 తులాల వెండి ఆభరణాలు, నిత్యావసర సరుకులు, వంట పాత్రలు, బట్టలు కాలిపోయినట్లు బాధితులు వాపోయారు. ఇటీవలే మేకలు అమ్మగా వచ్చిన రూ 2.60 లక్షల నగదును సందప్ప తన గుడిసెలోని ట్రంకు పెట్టెలో పెట్టగా, కాలిపోయాయి.
మొగలప్ప గుడిసెలో రూ 2.10 లక్షలు, అర తులం బంగారం, 80 తులాల వెండి వస్తువులు బుగ్గిపాలయ్యాయి. శనివారం కావడంతో మక్తల్ పడమటి ఆంజనేయ స్వామికి గండ జ్యోతి నైవేద్యం చేయాలని అన్నదమ్ములు సందప్ప, మొగలప్ప కుటుంబసభ్యులతో కలిసి వెళ్లారు. ఆ సమయంలో ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న మాజీ జడ్పీటీసీ లక్ష్మారెడ్డి తదితరులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. తహసీల్దార్ సతీశ్‌కుమార్, పోలీసులు వివరాలు తెలుసుకున్నారు.