హైదరాబాద్ లోని నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీనివాస బాయ్స్ హాస్టల్‌లో నిన్న (అక్టోబర్ 20) సాయంత్రం 6.40 గంటలకు అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బొగ్గులకుంటా కామినేని హాస్పిటల్ ముందు ఉన్న శ్రీనివాస హాస్టల్ లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో... ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్ల సహాయంతో మాటలను అదుపు చేశారు. హాస్టల్ లో ఉన్న ఎనిమిది మంది యువకులను కాపాడారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
హాస్టల్ లోని రెండంతస్తులో అగ్నిప్రమాదం సంభవించినట్లు నిన్న సమాచారం వచ్చిందని హైదరాబాద్ డిస్ట్రిక్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సకాలంలో ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశామన్నారు. మాములు సమయంలో 30 మంది వరకు ఈ హాస్టల్ లో ఉంటారని... దసరా సెలవులు కావడంతో చాలా మంది ఊర్లకు వెళ్లినట్లు వివరించారు. ఇరుకు గదుల్లో ఎక్కువ సమన్లు పెట్టడం వల్ల మంటలు వేగంగా వ్యాపించాయన్నారు.
రెసిడెన్షియల్ బిల్డింగ్ లో హాస్టల్ ను నడుపుతూ... ఎలాంటి ఫైర్ సేఫ్టీ పాటించని బిల్డింగ్ యజమానికి నోటీసులు ఇస్తామని హైదరాబాద్ డిస్ట్రిక్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఈ బిల్డింగ్ రెండవ అంతస్తులో మొదట మంటలు వ్యాపించాయని... అవి మొదటి అంతస్తుకు చేరుకున్నట్లు వివరించారు. మొదటి అంతస్తులో కిచెన్ లో గ్యాస్ సిలిండర్లు ఉన్నాయని... అక్కడి వరకు మంటలు వ్యాపించి ఉంటే, పెను ప్రమాదం సంభవించేదాని తెలిపారు. ఘటన సమయంలో హాస్టల్ లో దాదాపు 15 నుంచి 20మంది ఉన్నారని చెప్పారు.
ఈ ప్రమాదంలో కొంత మంది యువకుల సర్టిఫికెట్లు, బట్టలు, ల్యాప్ టాప్ లు ప్రమాదంలో బూడిద అయ్యాయని హాస్టల్ లో ఉండే యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. సమీపంలోని కామినేని హాస్పిటల్ లో పని చేసే ఓ యువకుడు జీతం పడటంతో డబ్బులు హాస్టల్ లో పెట్టి వచ్చానని.. ఊరికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఈ ప్రమాదం సంభవించిందని కన్నీరు పెట్టుకున్నాడు.