ముంబై: మహారాష్ట్ర ముంబైలోని నేవల్ డాక్‌యార్డ్‌లో ఉన్న యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో ఆదివారం సాయంత్రం మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ జూనియర్ నావికుడు గల్లంతయ్యాడు. అతని కోసం రెస్క్యూ టీమ్స్ గాలింపు చేపట్టాయి. నౌకలోని మిగతా సిబ్బంది సేఫ్ గానే ఉన్నట్లు నేవీ అధికారులు వెల్లడించారు. ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రకు రిపేర్లు నిర్వహిస్తుండగా మంటలు అంటుకున్నాయని తెలిపారు.
వెంటనే రంగం లోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది సోమవారం ఉదయానికి మంటలను అదుపులోకి తెచ్చారని చెప్పారు. అయితే, మధ్యాహ్యానికి నౌక నీటిలో ఓ పక్కకు ఒరిగిందని.. ఎంత ప్రయత్నించినా ఓడను నిటారుగా నిలబెట్టలేకపోయామని వివరించారు. ఓ నావికుడు మినహా మిగతా సిబ్బంది సేఫ్ గా ఉన్నారని తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నదని అధికారులు పేర్కొన్నారు.