జనగామలో భారీ అగ్నిప్రమాదం .. పూర్తిగా కాలిపోయిన మూడు దుస్తుల దుకాణాలు

జనగామలో భారీ అగ్నిప్రమాదం .. పూర్తిగా కాలిపోయిన మూడు దుస్తుల దుకాణాలు
  • ఎనిమిది ఫైర్‌‌‌‌ ఇంజిన్లతో రోజంతా శ్రమించి మంటలు అదుపు చేసిన సిబ్బంది
  • రూ. 10 కోట్ల పైగా నష్టంజరిగినట్లు అంచనా
  • ప్రమాదానికి షార్ట్‌‌‌‌ సర్క్యూటే కారణమని అనుమానాలు

జనగామ, వెలుగు : జనగామ జిల్లా కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సిద్దిపేట రోడ్డులోని విజయ, శ్రీలక్ష్మి షాపింగ్స్‌‌‌‌ మాల్స్‌‌‌‌తో పాటు పక్కనే ఉన్న ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ బ్రదర్స్‌‌‌‌ దుస్తుల దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదంలో సుమారు రూ. 10 కోట్ల వరకు నష్టం జరిగినట్లు అంచనా. వివరాల్లోకి వెళ్తే... జనగామ పట్టణంలోని విజయ షాపింగ్‌‌‌‌ మాల్‌‌‌‌ నిర్వాహకుడు భోగ భాస్కర్‌‌‌‌ శనివారం రాత్రి షాప్‌‌‌‌ క్లోజ్‌‌‌‌ చేసి ఇంటికి వెళ్లాడు. ఆదివారం తెల్లవారుజామున 6 గంటలకు షాపు నుంచి పొగలు వస్తుండడాన్ని గమనించిన స్థానికులు ఫైర్‌‌‌‌ సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

జనగామ ఫైర్‌‌‌‌ ఆఫీసర్లు, టౌన్‌‌‌‌ సీఐ దామోదర్‌‌‌‌రెడ్డి ఘటనాస్థలానికి చేరుకున్నారు. అప్పటికే మాల్‌‌‌‌లో ఉన్న దుస్తులు పూర్తిగా అంటుకోవడంతో మంటలు తీవ్రమయ్యాయి. పరిస్థితి చేయి దాటడంతో హనుమకొండ, వరంగల్‌‌‌‌, స్టేషన్‌‌‌‌ఘన్‌‌‌‌పూర్‌‌‌‌, పాలకుర్తి, ఆలేరు, భువనగిరి, మోత్కూరు నుంచి ఫైర్‌‌‌‌ ఇంజిన్లను రప్పించారు. మొత్తం ఎనిమిది ఫైర్‌‌‌‌ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు మంటలు అదుపులోకి వచ్చాయి. విజయ షాపింగ్‌‌‌‌ మాల్‌‌‌‌లో అర్ధరాత్రి ఏసీ కంప్రెషర్‌‌‌‌ పేలడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. 

మరో వైపు షార్ట్‌‌‌‌ సర్క్యూట్‌‌‌‌ లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా ? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. దగ్ధమైన షాపుల నుంచి ఫోరెన్సిక్‌‌‌‌ సిబ్బంది శాంపిల్స్‌‌‌‌ సేకరించారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీ పార్థసారథి, ట్రాన్స్‌‌‌‌కో ఎస్‌‌‌‌ఈ వేణుమాధవ్‌‌‌‌ సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. అగ్ని ప్రమాదం కారణంగా రోడ్డున పడ్డామని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు భోగ భాస్కర్, భోగ కైలాసం, స్వర్గం శ్రీనివాస్‌‌‌‌ కోరారు. ఘటనాస్థలాన్ని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌‌‌‌కుమార్‌‌‌‌రెడ్డి పరిశీలించి బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 

ఒకదాని నుంచి మరొక దానికి..

విజయ షాపింగ్‌‌‌‌ మాల్‌‌‌‌లో చెలరేగిన మంటలను ఫైర్‌‌‌‌ సిబ్బంది కంట్రోల్‌‌‌‌ చేస్తుండగానే అవి మరింత విస్తరించాయి. పక్కనే ఉన్న శ్రీలక్ష్మీ షాపింగ్‌‌‌‌ మాల్‌‌‌‌, ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ బ్రదర్స్‌‌‌‌ దుస్తుల దుకాణానికి మంటలు అంటుకొని పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు భారీ స్థాయిలో ఎగిసిపడడంతో బస్టాండ్‌‌‌‌ నుంచి నెహ్రూ పార్క్‌‌‌‌ రోడ్‌‌‌‌ మొత్తం దట్టమైన పొగ కమ్మేసింది. ఎలాంటి ఫైర్‌‌‌‌ సేఫ్టీ లేని కారణంగానే భారీ ప్రమాదం జరిగిందని ఆఫీసర్లు అభిప్రాయపడుతున్నారు.