ప్రయాగ్ రాజ్: మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం. సెక్టార్ 22లో ఏర్పాటు చేసిన టెంట్లు తగలబడ్డాయి. 2025, జనవరి 30వ తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సెక్టార్ 22లోని భక్తులు, వీఐపీల వసతి కోసం భారీ ఎత్తున ఏర్పాటు చేసిన టెంట్ల నుంచి మంటలు ఎగిసిపడటం కలకలం రేపింది. వందల మంది ఫైర్ సిబ్బంది స్పాట్ కు చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. జనవరి 19వ తేదీ కూడా ఇదే చోట.. ఇదే ప్రదేశంలో అగ్ని ప్రమాదం జరిగింది. పది రోజుల గ్యాప్ లో.. సెక్టార్ 22లోనే.. అక్కడే మళ్లీ .. అవే టెంట్లు తగలబడటం చర్చనీయాంశం అయ్యింది.
మహా కుంభమేళాలో సెక్టార్ 22 అనేది చాలా కీలకమైన ప్రాంతం. ఈ ఏరియాలో ఎక్కువ సంఖ్యలో భక్తుల వసతి కోసం వేల సంఖ్యలో టెంట్లు ఏర్పాటు చేశారు. వీఐపీల రాక కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. సెక్టార్ 22 నుంచి త్రివేణి సంగమం ప్రధాన ప్రదేశం దగ్గరలోనే ఉంటుంది. ఈ సెక్టార్ 22కు సమీపంలోనే గంగ, యమున, సరస్వతి నదుల సంగమం ఉంటుంది. నదిలోపల.. నదుల సంగమం దగ్గర పవిత్ర స్నానం చేయాలి అని నిర్ణయించుకున్న వారు ఈ సెక్టార్ 22 దగ్గరకు వస్తుంటారు. ఓ రకంగా సెక్టార్ 22 వీఐపీ తాడికి కూడా ఎక్కువగా ఉంటుంది.
ఇలాంటి సెక్టార్ 22లోనే.. 10 రోజుల గ్యాప్ లో రెండు సార్లు అగ్ని ప్రమాదం జరగటం సంచలనంగా మారింది. జనవరి 19వ తేదీన జరిగిన ప్రమాదానికి గ్యాస్ సిలిండర్లు అని తేల్చిన అధికారులు.. 30వ తేదీ జరిగిన ప్రమాదానికి కారణం ఏంటీ అనేది ఇంకా ప్రకటించలేదు.
మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగి 30 మంది చనిపోయిన 48 గంటల్లోనే భారీ అగ్నిప్రమాదం కలకలం రేపుతోంది. యూపీ ప్రభుత్వాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తుంది. మౌని అమావాస్య ముగిసిన 24 గంటల్లోనే అగ్ని ప్రమాదం జరగటంతో.. కుంభమేళాలోని భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు.
జనవరి 19న కూడా మహా కుంభ మేళాలోని సెక్టార్ 19లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జనవరి 19న సాయంత్రం 4.30 గంటల సమయంలో శాస్త్రి బ్రిడ్జ్ సమీపంలోని గీతా ప్రెస్‌లో టీ పెడుతుండగా చిన్న గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ లీకైంది. దీంతో.. అదే కిచెన్‌లో ఉన్న మరో రెండు పెద్ద సిలిండర్లు బ్లాస్ట్ అయ్యాయి.
అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ మంటలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. అదే సమయంలో శాస్త్రి బ్రిడ్జ్‌పై రైలు వెళుతుంది. బ్రిడ్జ్ పైన రైలు వెళుతుండగా బ్రిడ్జ్ కింద నుంచి మంటలు పైవరకూ ఎగసిపడ్డాయి. సమీపంలోని టెంట్లు పూర్తిగా తగలబడిపోయి ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు వ్యాపించాయి.