ఊరూర చెరువుల పండగలో అపశృతి.. తగలబడిన టెంట్

నిజామాబాద్ జిల్లా  మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది.  భీంగల్ మండలం  పురనిపెట్ గ్రామంలో ఊరూర చెరువుల  పండగ సందర్భంగా  మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రాకతో  బాణసంచా  పేల్చగా  అక్కడే ఉన్న టెంట్ పై పడడంతో ఒక్కసారి మంటలు చెలరేగాయి.  వెంటనే స్థానికులు మంటలు అర్పడంతో పెను ప్రమాదం తప్పింది.

తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం జూన్ 8న ఊరూర చెరువుల పండుగ కార్యక్రమం జరుపుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా  ప్రతి ఊరిలో చెరువు కట్టల వద్దకు మహిళలు బతుకమ్మలు, బోనాలతో వెళ్తారు.  చెరువు కట్టలపై విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు.  ఆటలు, పాటలతో కట్ట మైసమ్మ పూజలు నిర్వహించి హాజరైన వారందరికీ భోజన వసతి కల్పించాలని అధికారులు ఆదేశించారు.  

మరోవైపు దశాబ్ది ఉత్సవాలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు గడిచినా ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజా ధనాన్ని  దుర్వినియోగం చేస్తున్నాయని విమర్శిస్తున్నాయి.