ఇంట్లో మంటలు.. వ్యక్తి సజీవదహనం

ఇంట్లో మంటలు.. వ్యక్తి సజీవదహనం
  • సూసైడ్ ​చేసుకున్నట్లు అనుమానాలు

కూకట్​పల్లి, వెలుగు: బాలానగర్​లోని ఓ ఇంట్లో చెలరేగిన మంటల్లో ఒకరు సజీవ దహనమయ్యారు. ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని అతను మృతి చెందాడా? లేక సూసైడ్ చేసుకున్నాడా? అన్న విషయం ప్రస్తుతానికి స్పష్టత రాలేదు. పోలీసుల వివరాల ప్రకారం.. రాజమండ్రికి చెందిన శ్రీనివాస్​(32) పటాన్​చెరులోని కెమికల్​ఫ్యాక్టరీలో వర్కర్​గా పని చేస్తున్నాడు. కుటుంబ కలహాల కారణంగా రెండేండ్ల కింద భార్యను వదిలేశాడు. రెండు నెలల క్రితం బాలానగర్​లోని సంజీవయ్య కాలనీలో ఒక రూమ్​అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడు.

 ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇప్పటికే రూ.10 లక్షలు అప్పులు చేశాడు. ఈ పరిస్థితుల్లో శ్రీనివాస్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆదివారం తెల్లవారుజామున అతని గదిలో నుంచి మంటలు రావడంతో స్థానికులు ఫైర్ సిబ్బందితోపాటు పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్​సిబ్బంది మంటలు ఆర్పి చూస్తే అప్పటికే శ్రీనివాస్​పూర్తిగా కాలి మృతి చెంది ఉన్నాడు. లోపలి నుంచి తలుపులకు గడియ పెట్టి ఉండటంతో ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడం గానీ లేదా అతనే సూసైడ్​ చేసుకోవటం గానీ జరిగి ఉంటుందని పోలీసులు తెలిపారు. 

ఇంట్లో గ్యాస్​సిలిండర్​కూడా లేకపోవటం, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక సమస్యలను గమనిస్తే సూసైడ్​ చేసుకోవడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటున్నారు. డీజిల్​ లేదా పెట్రోల్​, లేదా తాను పని చేసే ఫ్యాక్టరీ నుంచి తీసుకువచ్చిన కెమికల్​ పోసుకుని నిప్పంటించుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. శ్రీనివాస్​ కుటుంబ సభ్యులు వస్తేనే అసలు కారణం తెలిసే అవకాశం ఉందని చెప్తున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని బాలానగర్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.