![సంగారెడ్డి జిల్లాలో చెరుకు తోటల్లో మంటలు](https://static.v6velugu.com/uploads/2025/02/fire-mishaps-reduce-sugarcane-produce-to-ashes-in-sangareddy-district_7H6apeZQdK.jpg)
- విద్యుత్‌వైర్లు తగిలి తగలబడుతున్న చేలు
- అగ్ని ప్రమాదాలతో డ్రిప్ పరికరాలు దగ్ధం
- కోట్లల్లో నష్టపోతున్న రైతులు
సంగారెడ్డి, వెలుగు: జిల్లాలో ఇటీవల చెరుకు తోటలు ఎక్కువగా దగ్ధమవుతున్నాయి. పంట పొలాల్లో వేలాడుతున్న విద్యుత్ తీగలే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. అసలే గిట్టుబాటు ధర లేక పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉండగా మరో వైపు పండించిన పంట సైతం కాలిపోతుండడంతో చెరుకు రైతులు లబోదిబోమంటున్నారు. జిల్లాలోని సంగారెడ్డి, ఝరాసంగం, జహీరాబాద్, మొగుడంపల్లి, న్యాల్కల్, పుల్కల్ మండలాల్లో ఎక్కువగా చెరుకు పండిస్తున్నారు.
దాదాపు 26 వేల ఎకరాల్లో చెరుకు పంట సాగవుతుంది. ఇటీవల మొగుడంపల్లి, న్యాల్కల్, పుల్కల్ మండలాల్లో 90 ఎకరాల చెరుకు తోటలు విద్యుత్‌వైర్ల కారణంగా కాలి బూడిదయ్యాయి. సుమారు కోటిన్నర వరకు రైతులు నష్టపోయారు. విత్తనాలు నాటిన నుంచి ఫ్యాక్టరీలకు పంటను తరలించే వరకు చెరుకు రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రమాదాలకు కారణాలు
చెరుకు పంటకు నీరందించేందుకు రైతులు పంపుసెట్లు, మోటార్లకు విద్యుత్ కనెక్షన్లు తీసుకుంటారు. చెరుకు గడలు ఏపుగా పెరగడంతో కొన్నిసార్లు అవి చేనులో ఉండే విద్యుత్ వైర్లకు తగిలి అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అలాగే విద్యుత్ తీగలు వదులు కావడం వల్ల గాలి వీచే టైంలో ఒకదానికి మరొకటి తగిలి నిప్పు రవ్వలు చేనులో పడి మంటలు వ్యాపిస్తున్నాయి. ఈ అగ్ని ప్రమాదాల్లో చెరుకు పంటతో పాటు డ్రిప్‌పరికరాలు కూడా తగలబడిపోతున్నాయి. చెరుకు తోటలు ఉన్న ఏరియాలో ఆరడుగుల దూరంలో విద్యుత్ స్తంభాలు, తీగలు ఉండేలా విద్యుత్‌అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. తీగలు వదులుగా ఉండకుండా ఎప్పటికప్పుడు సరిచేస్తూ ఉండాలి. ముందస్తు సమాచారం ఇచ్చినా విద్యుత్ అధికారులు పట్టించుకోవడంలేదని చెరుకు రైతులు ఆరోపిస్తున్నారు.
ఇటీవల జరిగిన ప్రమాదాలు
న్యాల్కల్ మండలం హద్నూర్ గ్రామానికి చెందిన మల్లికార్జున్, బస్వరాజ్, యాదుల్లాకు చెందిన 11 ఎకరాల చెరుకు తోట నెలరోజుల కింద దగ్ధమైంది. ఈ ప్రమాదంలో పంటతోపాటు డ్రిప్ పరికరాలు కాలిపోయాయి. ఈ ఘటనలో రూ.15 లక్షల ఆస్తి నష్టం జరిగింది. జనవరి 21న మొగుడంపల్లి మండలం ఇప్పేపల్లి గ్రామంలో పదిమందికి చెందిన 50 ఎకరాల చెరుకు పంట దగ్ధమైంది. ఈ ప్రమాదంలో దాదాపు రూ.కోటి నష్టం జరిగింది. జనవరి 21న ఇప్పేపల్లి గ్రామంలో రైతు ఇపప్పకు చెందిన చెరుకు తోటలో షాట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి పొలంలోని డ్రిప్ పరికరాలు కాలిపోయాయి. ఈ ఘటనలో రూ.2 లక్షల నష్టం జరిగింది.
జనవరి 22న మొగుడంపల్లి మండలం గౌసబాద్ గ్రామంలో రైతు సంజీవరెడ్డి పొలంలో చెరుకు పంటను లారీలో లోడ్ చేస్తుండగా పెద్ద ఎత్తున గాలి వీచి పక్కనే వదులుగా ఉన్న విద్యుత్‌తీగలు ఒకదానికొకటి తగిలి నిప్పు రవ్వలు పడి పంటతోపాటు లారీ కూడా దగ్ధమైంది. ఈ ఘటనలో పెద్ద మొత్తంలో నష్టం జరిగింది. ఫిబ్రవరి 9న పుల్కల్ మండలం ముద్దాయి పేటలో రైతు కుమ్మరి లింగయ్యకు చెందిన 14 ఎకరాల చెరుకు తోటకు నిప్పు అంటుకొని కాలిపోయింది. ఈ ఘటనలో రూ.7 లక్షల నష్టం వాటిల్లింది. మొగుడంపల్లి మండలం గుడిపల్లి గ్రామ సమీపంలో నెల రోజుల కింద మంటలు అంటుకొని ఆరెకరాల చెరుకు తోట దగ్ధమైంది. ఈ ఘటనలో రూ.5.50 లక్షలు నష్టం జరగగా పక్కనున్న మామిడి తోటకు మంటలు అంటుకున్నాయి.