జనగామ జిల్లాలో ఫైర్ సేఫ్టీ అంతంతే .. అగ్ని ప్రమాదాలతో తప్పని టెన్షన్​

జనగామ జిల్లాలో ఫైర్ సేఫ్టీ అంతంతే .. అగ్ని ప్రమాదాలతో తప్పని టెన్షన్​
  • అరకొర వసతులతో స్టేషన్లు.., సిబ్బంది కొరత
  • జనగామ జిల్లా ఫైర్ ఆఫీసర్​కు ఆఫీసే లేదు

జనగామ, వెలుగు : జనగామ జిల్లాలో అగ్ని మాపక శాఖ అరకొర వసతులతో ఇబ్బంది పడుతోంది. చాలీచాలని సిబ్బందితో అవస్థలు పడుతున్నారు. పేరుకు మూడు ఫైర్​ స్టేషన్లు ఉన్నా, ఎక్కడా పూర్తిస్థాయి సిబ్బంది లేరు. ఉన్న వారినే ఇక్కడికి అక్కడికి అడ్జస్ట్​ మెంట్లు చేసుకుంటూ నెట్టుకొస్తున్నారు. ప్రస్తుత వేసవిలో తరచుగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటుండడంతో ఫైర్​ సిబ్బందికి టెన్షన్​తప్పడం లేదు.

అడ్జస్ట్ మెంట్​లే..

ఫైర్ స్టేషన్లలో పూర్తిస్థాయి సిబ్బంది లేకపోవడంతో అడ్జస్ట్​ మెంట్లపైనే ఆధారపడుతున్నారు. ఒక్కో ఫైర్ స్టేషన్​లో ఒక ఫైర్​ ఆఫీసర్, ఇద్దరు లీడింగ్​ఫైర్​మెన్లు, ముగ్గురు డ్రైవర్లు (ఆపరేటర్లు), 10 మంది కానిస్టేబుళ్లు కలిపి 16 మంది సిబ్బంది ఉండాలి. జనగామ ఫైర్ స్టేషన్​ పరిధిలో జనగామ, నర్మెట, తరిగొప్పుల, బచ్చన్నపేట, లింగాల ఘన్​పూర్​, రఘనాథపల్లి మండలాలు ఉన్నాయి. ఎక్కువ ప్రమాదాలు జరిగే ఈ స్టేషన్​ పరిధిలో ఒక ఫైర్​ ఆఫీసర్, ఇద్దరు లీడింగ్​ఫైర్​మెన్లు, 5 గురు కానిస్టేబుళ్లు, ఇద్దరు డ్రైవర్లు మాత్రమే ఉన్నారు. జిల్లా కేంద్రం కావడంతో ఇతర స్టేషన్ల నుంచి సిబ్బందిని అడ్జస్ట్​ చేస్తూ సేవలందిస్తున్నారు. 

స్టేషన్ ఘన్​పూర్​ ఫైర్ స్టేషన్​ పరిధిలో చిల్పూరు, స్టేషన్ ఘన్​పూర్, జఫర్​ఘడ్ మండలాలున్నాయి. ఇక్కడ ఒక ఫైర్ ఆఫీసర్, ఇద్దరు లీడింగ్ ఫైర్​ మెన్లు ఉన్నప్పటికీ ఫైర్​ కానిస్టేబుళ్లు నలుగురే ఉన్నారు. పాలకుర్తి స్టేషన్ పరిధిలో దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల మండలాలు ఉండగా, ఇక్కడ ఒక ఫైర్ ఆఫీసర్, ఇద్దరు లీడింగ్ ఫైర్​మెన్లు, ముగ్గురు డ్రైవర్లు (ఆపరేటర్లు) ఉండగా, ఒక డ్రైవర్ జనగామలో విధులు చేపడుతున్నారు. కానిస్టేబుళ్లు ఐదుగురే ఉన్నారు. 

జిల్లా ఆఫీసర్​కు ఆఫీసే లేదు..

కొత్త జిల్లాలు ఏర్పాటైన తదుపరి ఎట్టకేలకు గతేడాది జూలైలో జిల్లా ఫైర్ ఆఫీసర్​ పోస్టు మంజూరై జిల్లా ఆఫీసర్ల నియామకం అయ్యింది. కానీ నేటికీ సదరు అధికారికి ఆఫీస్ లేదు. అక్కడ ఉండాల్సిన సూపరెంటెండెంట్, సీనియర్​ అసిస్టెంట్, ఇద్దరు జూనియర్​ అసిస్టెంట్లు లేరు. పేరుకు పోస్టులు క్రియేట్ చేసి పంపడంతో జిల్లా కేంద్రంలో ఉన్న ఫైర్ స్టేషన్ ఆఫీస్​లోనే జిల్లా ఫైర్​ ఆఫీసర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు విధులు నిర్వహిస్తున్నారు. జనగామ ఫైర్ స్టేషన్​ పాత బిల్డింగ్ కావడంతో ఫైర్ ఇంజన్​కు షెడ్, సిబ్బందికి విశ్రాంతి గది సరిగా లేక ఇబ్బందులు పడుతున్నారు. రెండెకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆవరణలోనే రూ 4.5 లక్షలతో జిల్లా ఫైర్ ఆఫీసర్ ఆఫీస్ నిర్మాణానికి ప్రతిపాదనలు రెడీ చేశారు. ఉన్నతాధికారులు పట్టించుకోక పోవడంతో అడుగులు ముందుకు పడడం లేదు. 

ప్రమాదాలతో తప్పని టెన్షన్..​

ఉమ్మడి వరంగల్ జిల్లాలో తరచూ ఏదో చోట అగ్ని ప్రమాదాలు ఫైర్ సిబ్బందిలో టెన్షన్ పెడుతున్నాయి. జనగామ జిల్లా కేంద్రంలో గతేడాది నెహ్రూ పార్క్ రోడ్​లోని మూడు బట్టల దుకాణాలు కాలిపోయి కోట్లల్లో నష్టం వాటిల్లింది. ఆ టైంలో పక్క జిల్లాల నుంచి ఫైర్​ ఇంజన్లు, సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. గత నెల 12న జిల్లాకేంద్రం హైదరాబాద్ రోడ్​లో ఉన్న ఓ ఎలక్ట్రికల్ అండ్ హార్డ్​వేర్, పెయింట్స్ దుకాణం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. గత శనివారం రఘునాథపల్లి మండలంలోని అశ్వరావు పల్లి గుట్టలకు నింపంటుకుంది. ఆదివారం మధ్యాహ్నాం వరకు ఈ మంటలను అర్పివేశారు.

మల్టీ పర్పస్ ఫైర్ ఇంజన్ మంజూరు..

జనగామ ఫైర్ స్టేషన్ లో ఉన్న ఫైర్​ ఇంజన్​ 15 ఏండ్ల కాలం పూర్తి కావడంతో కొత్త వాహనం కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. జిల్లా కేంద్రాల్లోని ఫైర్ స్టేషన్లలో అధునాతన సౌకర్యాలున్న ఫైర్ ఇంజన్లను త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగా జనగామ కు మల్టీ పర్పస్ ఫైర్ టెండర్​ ఇంజన్ మంజూరైనట్లు తెలిపారు. దీంతో వాటర్​ స్ప్రే ద్వారా విద్యుత్​ షాక్ వంటి ప్రమాదాలు ఉండే అవకాశాలున్న అగ్ని ప్రమాదాలను ఇబ్బంది లేకుండా నివారించే వెసులుబాటు ఉంటుంది. ఈ ఇంజన్​లో డ్రై కెమికల్ పౌడర్, ఫోమ్ కాంపౌండ్, కార్బన్​డై ఆక్సైడ్ వంటివి ఉపయోగించి కరెంట్​ ప్రమాదాలు, అయిల్ ఫైర్స్, గ్యాస్, పెట్రోల్ బంక్​ల అగ్ని ప్రమాదాలను చల్లార్చే సౌకర్యం ఉంటుంది.  

ప్రమాదాల నివారణకు చర్యలు..

అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా జిన్నింగ్​ మిల్లులు, ఫంక్షన్ హాల్స్, పెద్ద షాపింగ్ మాల్స్, గోడౌన్లు తదితరాల యాజమాన్యాలకు ఫైర్​ సేఫ్టీ యంత్రాలు అమర్చుకోవాలని నోటీసులు ఇచ్చాం. పబ్లిక్​కు నష్టం కలిగించేలా వ్యవహరిస్తే రూల్స్ మేరకు చర్యలుంటాయని హెచ్చరించాం. ఫైర్​ స్టేషన్లలో సిబ్బంది కొరతపై ఉన్నతాధికారులకు నివేదించాం. ఉన్నంతలో మెరుగైన సేవలు అందించేందుకు పాటుపడుతున్నాం.​

బీఆర్ బాబు, జిల్లా ఫైర్ ఆఫీసర్, జనగామ